సోమవారం 30 మార్చి 2020
Business - Jan 17, 2020 , 00:13:52

31 నుంచి బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె

31 నుంచి బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె
  • రెండు రోజులపాటు విధులకు దూరం

న్యూఢిల్లీ, జనవరి 16: బ్యాంక్‌ ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టారు. వేతన సవరణకు నిరసనగా ఈ నెల 31 నుంచి వచ్చే నెల 1 వరకు అంటే రెండు రోజులపాటు దేశవ్యాప్త సమ్మె చేయనున్నట్లు యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌(యూఎఫ్‌బీయూ) ప్రకటించింది. వేతన సవరణకు సంబంధించి ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌తో జరిపిన చర్చలు విఫలంకావడంతో రెండు రోజులపాటు సమ్మె చేయాలని నిర్ణయించినట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల సిబ్బంది వేతన పెంపునకు సంబంధించి నవంబర్‌ 2017 నుంచి పెండింగ్‌లో ఉన్నది. యూఎఫ్‌బీయూ ప్రకటించిన ఈ సమ్మెలో ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫడరేషన్‌(ఏఐబీవోసీ), ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌(ఏఐబీఈఏ), నేషనల్‌ ఆర్గనేజేషన్‌ ఆఫ్‌ బ్యాంక్‌ వర్కర్స్‌(ఎన్‌వోబీడబ్ల్యూ)ల యూనియన్లకు సంబంధించిన ఉద్యోగులు పాల్గొనబోతున్నారు.


2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ రోజే బ్యాంక్‌ ఉద్యోగులు సమ్మెబాట పట్టడం విశేషం. వేతనాలను 20 శాతం పెంచాలని, వారానికి ఐదు రోజుల పని, ఇతర అలవెన్స్‌ల డిమాండ్లపై ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌తో ఈ నెల 13న జరిపిన చర్చలు విఫలంకావడంతో సమ్మె చేయాలని నిర్ణయించినట్లు యూఎఫ్‌బీయూ ఒక ప్రకటనలో పేర్కొంది. నవంబర్‌ 1, 2012 నుంచి అక్టోబర్‌ 31, 2017 మధ్యకాలంలో సిబ్బంది వేతనాలను 15 శాతం చొప్పున పెంచిన విషయం తెలిసిందే. డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదని, ఈసారి కూడా పరిష్కరించకపోతే మార్చి 11 నుంచి 13 వరకు మరోసారి సమ్మె చేయాలని నిర్ణయించినట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. అప్పటికీ పెంచకపోతే ఏప్రిల్‌ 1 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 8న ట్రేడ్‌ యూనియన్లు ప్రకటించిన ఒక్కరోజు సమ్మెలో భాగంగా బ్యాంకింగ్‌ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు.


logo