టోక్యో: కరోనా టీకాలను సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తైవాన్‌కు భారీ ఊరట లభించింది. పది లక్షలకుపైగా ఆస్ట్రాజెనెకా టీకాలను అందిచనున్నట్లు ప్రకటించింది. టీకాలను ఉచితంగా అందిస్తామని జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి వెల్లడించారు. వ్యాక్సిన్ల కోసం పలు దేశాల నుంచి తమకు విజ్ఞప్తులు వచ్చాయని, తైవాన్ కూడా తమకు టీకాలు అందించాలని కోరిందని చెప్పారు. ఈ నేపథ్యంలో తైవాన్‌కు పది లక్షల 24 వేల ఆస్ట్రాజెనెకా టీకాలను ఉచితంగా అందించనున్నట్లు మంత్రి తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశామని వెల్లడించారు.
కాగా, జపాన్ ప్రకటనను తైవాన్ విదేశాంగ మంత్రి స్వాగతించారు. ఇది ఇరుగుపొరుగు దేశాల మధ్య బంధాన్ని బలపరుస్తుందని చెప్పారు. దేశంలో వారం రోజుల్లో సుమారు 10 వేల కేసులు నమోదవగా, 166 మంది మరణించారు.
దేశంలో 30 లక్షల డోస్‌లకు ముందస్తు ఆర్డర్లు ఇవ్వగా ఇప్పటివరకు కేవలం 7,26,600 ఆస్ట్రాజెనెకా, 1,50,000 మోడెర్నా టీకాలను మాత్రమే సమకూర్చుకోగలిగింది. దేశంలో మొత్తం 23.5 మిలియన్ల జనాభా ఉన్నారు.