శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Jan 15, 2020 , 00:34:18

‘చేతక్‌' పునరాగమనం

‘చేతక్‌' పునరాగమనం
  • ఈ- స్కూటర్‌గా రీఎంట్రీ
  • రెండు వేరియంట్లలో లభ్యం
  • గరిష్ఠంగా 95 కి.మీ. మైలేజీ
  • ‘అర్బన్‌' ప్రారంభ ధర రూ.లక్ష
  • ‘ప్రీమియం’ రూ. 1.15 లక్షలు

ముంబై, జనవరి 14: దేశీయ ద్విచక్ర వాహన రంగంలో 90వ దశకం వరకు ‘హమారా బజాజ్‌' అంటూ రాజసాన్ని ఒలకబోసిన చేతక్‌ స్కూటర్‌ మళ్లీ వచ్చేసింది. అయితే ఇప్పుడు మామూలు స్కూటర్‌లా కాకుండా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ రూపంలో రీఎంట్రీ ఇచ్చింది. ద్విచక్ర వాహన కొనుగోలుదారులను దీర్ఘకాలం నుంచి ఊరిస్తున్న చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను బజాజ్‌ ఆటో సంస్థ మంగళవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎక్స్‌-షోరూం ప్రారంభ ధరను లక్ష రూపాయలుగా నిర్ణయించింది. ఈ స్కూటర్ల బుకింగ్‌లు బుధవారం (జనవరి 15) నుంచి మొదలవుతాయని, ఫిబ్రవరి చివరి నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని, తొలుత రెండు నగరాల్లో (పుణె, బెంగళూరు) ఈ స్కూటర్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది.

‘జనవరి 15 నుంచి రెండు నగరాల్లో చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి. దీంతో దేశీయ ద్విచక్ర వాహన రంగంలో సరికొత్త శకం మొదలవుతుంది’ అని బజాజ్‌ ఆటో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ శర్మ తెలిపారు. బజాజ్‌ ఆటో కంపెనీ గతేడాది అక్టోబర్‌లోనే కొత్త చేతక్‌ను ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అర్బన్‌, ప్రీమియం వేరియంట్లలో లభ్యమవుతుందని, వీటితోపాటు ప్యాకేజీలో హోం-చార్జింగ్‌ స్టేషన్‌ కూడా ఉంటుందని కంపెనీ వివరించింది. చేతక్‌ వెబ్‌సైట్‌లో రూ.2 వేలు చెల్లించి కొనుగోలుదారులు ఆన్‌లైన్‌లో ఈ స్కూటర్లను బుక్‌చేసుకోవచ్చని తెలిపింది.


లిథియం అయాన్‌ బ్యాటరీతో కలిపి ఓవరాల్‌గా 50 వేల కి.మీ. లేదా మూడేండ్ల (ఈ రెండింటిలో ఏది ముందయితే అది) వారంటీని కలిగి ఉండే ఈ స్కూటర్‌ను ఒకసారి చార్జ్‌ చేస్తే గరిష్ఠంగా 95 కి.మీ., స్పోర్ట్స్‌ మోడల్‌ అయితే 85 కి.మీ. మైలేజీ ఇస్తుందని బజాజ్‌ కంపెనీ పేర్కొన్నది. డ్రమ్‌ బ్రేకులతో లభ్యమయ్యే ‘చేతక్‌ అర్బన్‌' ఎడిషన్‌ ఎక్స్‌-షోరూం ధరను రూ.1 లక్షగా, డిస్క్‌ బ్రేకులతోపాటు లగ్జరీ ఫినిష్‌తో లభ్యమయ్యే ‘ప్రీమియం’ ఎడిషన్‌ ధరను రూ.1.15 లక్షలుగా నిర్ణయించినట్టు కంపెనీ వెల్లడించింది.


logo