బుధవారం 03 మార్చి 2021
Business - Jan 04, 2021 , 17:12:59

మోస్ట్‌ వాల్యూబుల్‌ టూ వీలర్స్‌ బజాజ్‌ ఆటో

మోస్ట్‌ వాల్యూబుల్‌ టూ వీలర్స్‌ బజాజ్‌ ఆటో

న్యూఢిల్లీ: ప్రపంచంలోకెల్లా అత్యంత విలువైన టూ వీలర్‌ కంపెనీగా బజాజ్‌ ఆటో నిలిచింది. ఈ నెల ఒకటో తేదీ నాటికి బజాజ్‌ ఆటోమొబైల్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (ఎం-క్యాప్‌) విలువ రూ. లక్ష కోట్లను దాటింది. శుక్రవారం నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ)లో క్లోజ్‌ అయిన కంపెనీ షేర్‌ విలువ రూ. 3,479తో దాని మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1,00,670.76 కోట్లకు చేరుకున్నది.

దేశంలోని ఇతర టూ వీలర్‌ కంపెనీల ఎం-క్యాప్‌ కంటే తమ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విలువ ఎక్కువ అని బజాజ్‌ ఆటో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ లక్ష్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ టూ వీలర్‌ సంస్థ కూడా చేరుకోలేదని వ్యాఖ్యానించింది. సంస్థ 75వ వార్షికోత్సవం సందర్భంగా బజాజ్ ఆటో ఈ లక్ష్యాన్ని చేరుకోవడం ఆసక్తికర పరిణామం. 

బజాజ్‌ ఆటో మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ బజాజ్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ద్విచక్ర వాహనాల విభాగంపై కంపెనీ ప్రధానంగా దృష్టి సారించింది. విభిన్న వ్యూహాల రూపకల్పనలో అచంచలమైన నిబద్ధతను ప్రదర్శిస్తున్నందువల్లే బజాజ్‌ ఆటోను ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలువైన కంపెనీగా నిలిపాయి. మేం సాధించిన ఈ లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా మా కస్టమర్లకు మరింత సేవ చేసేందుకు, వారిని సంతోషపెట్టేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని వ్యాఖ్యానించారు. 

ఆస్ట్రియాలోని కేటీఎం ఏజీతోపాటు స్వీడిష్‌ మోటార్‌ సైకిల్‌ బ్రాండ్‌ హుస్‌క్వార్నాలలో బజాజ్ ఆటో 48 శాతం వాటా కలిగి ఉంది. బజాజ్‌ ఆటో, కేటీఎం ఏజీ సంయుక్తంగా టూ వీలర్స్‌ను డిజైన్‌ చేసి, భారత్‌లో ఉత్పత్తి చేస్తాయి. బ్రిటన్‌ సంస్థ ట్రయంఫ్‌ మోటార్‌ సైకిల్స్‌లో బజాజ్‌ ఆటో నాన్‌-ఈక్విటీ పార్టనర్‌షిప్‌ కలిగి ఉంది. భారత్‌తోపాటు ఇతర గ్లోబల్‌ మార్కెట్లలో ట్రయంఫ్‌ మోటారు సైకిళ్ల విక్రయంలో భాగస్వామిగా ఉంటుంది. 

పుణెకు సమీపాన చకాన్‌లో, ఔరంగాబాద్‌కు సమీపంలోని వలూజ్‌, ఉత్తరాఖండ్‌లోని పంత్‌నగర్‌లో బజాజ్‌ ఆటో ఉత్పాదక యూనిట్లు ఉన్నాయి. ఇటీవలే చకాన్‌లో నాలుగో ప్రొడక్షన్‌ యూనిట్‌ ప్రారంభించనున్నట్లు బజాజ్‌ ఆటో ప్రకటించింది. రూ.650 కోట్ల అంచనా వ్యయంతో ప్రీమియం సెగ్మెంట్‌ బైక్స్‌, ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్‌ను ఉత్పత్తి చేయనున్నది. బజాజ్‌ ఆటో టూ వీలర్స్‌, త్రీ వీలర్స్‌ అతిపెద్ద ఎగుమతిదారుగా నిలుస్తుంది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo