శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Feb 03, 2021 , 01:08:40

జాక్‌కు మరో షాక్‌

జాక్‌కు మరో షాక్‌

  •  చైనా టెక్‌ దిగ్గజాల జాబితా నుంచి తొలగింపు 
  • ప్రత్యర్థులపై చైనా అధికార మీడియా ప్రశంసలు

బీజింగ్‌, ఫిబ్రవరి 2: అలీబాబా గ్రూపు సహ వ్యవస్థాపకుడైన జాక్‌ మాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. చైనాలోని టెక్‌ దిగ్గజాల జాబితా నుంచి ఆయనను తొలగించారు. చైనా అధికారిక మీడియా ప్రచురించిన ఈ జాబితాలో జాక్‌ మా ఊసే లేదు. పైపెచ్చు ఈ జాబితాలోని వ్యక్తులపై ప్రచురించిన కథనంలో అలీబాబా ప్రత్యర్థి కంపెనీ అయిన ‘టెన్సెంట్‌' అధినేత పోనీ మాపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా ‘షియామీ’ సంస్థ సహ వ్యవస్థాపకుడు లీ జున్‌, హువావే కంపెనీ అధినేత రెన్‌ జెంగ్‌ఫెయ్‌, ‘బీవైడీ కో’ సంస్థ చైర్మన్‌ వాంగ్‌ చువాన్‌ఫు లాంటి వ్యాపారవేత్తలకు కూడా ఈ జాబితాలో చోటు కల్పించారు. చైనా అధికార వార్తా సంస్థ ‘షిన్హువా’కు అనుబంధంగా పనిచేస్తున్న ‘షాంఘై సెక్యూరిటీ న్యూస్‌' పత్రిక మంగళవారం ఈ కథనాన్ని ప్రచురించింది.

‘టెన్సెంట్‌' సీఈవో పోనీ మా సాంకేతికతతో చరిత్రను తిరగరాస్తున్నారని కొనియాడింది. కానీ ఈ కథంనలో జాక్‌ మా ప్రస్తావనేమీ లేకపోవడంతో అందరూ నోరెళ్లబెడుతున్నారు. కొద్ది నెలల క్రితం ఆయన చైనా ప్రభుత్వానికి సలహాలివ్వబోయి పాలకుల ఆగ్రహానికి గురైన విషయం విదితమే. గతేడాది అక్టోబర్‌ 24న చైనా వాణిజ్య రాజధాని షాంఘైలో జరిగిన ఓ కార్యక్రమంలో జాక్‌ మా ప్రసంగిస్తూ చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను తూర్పారబట్టారు. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల్లా వ్యవహరిస్తున్నాయని ఎండగట్టారు. ఈ ధోరణిని విడనాడి విస్తృత దృక్పథంతో ఆలోచించాలని హితవు పలికారు. దీంతో జిన్‌పింగ్‌ సర్కార్‌కు చిర్రెత్తుకొచ్చింది. జాక్‌ మాపై ప్రతీకార చర్యలకు ఉపక్రమించింది. ఆయన వ్యాపార సామ్రాజ్యంపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టింది. 

అంతటితో ఆగకుండా జాక్‌ మాకు చెందిన యాంట్‌ ఫైనాన్షియల్‌ గ్రూపు ఐపీవోను అడ్డుకొన్నది. ఈ పరిణామాల నేపథ్యంలో జాక్‌ మా బాహ్య ప్రపంచానికి దూరమయ్యారు. దీంతో ఆయన అదృశ్యంపై అనేక అనుమానాలు తలెత్తాయి. కానీ ఇటీవల జాక్‌ మా ‘వర్చువల్‌'గా ప్రత్యక్షమయ్యారు. గ్రామీణ ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నట్లు చైనా వార్తా పత్రిక ‘గ్లోబల్‌ టైమ్స్‌' వెల్లడించింది. దీంతో జాక్‌ మా అదృశ్యంపై నెలకొన్న అనుమానాలకు తెర పడింది.

VIDEOS

logo