గురువారం 13 ఆగస్టు 2020
Business - Jul 08, 2020 , 02:11:12

మళ్లీ ఈఎంఐల్లోకి..

మళ్లీ ఈఎంఐల్లోకి..

  • అన్‌లాక్‌తో మారటోరియాన్ని వదిలేస్తున్న రుణగ్రహీతలు: బ్యాంకర్లు

న్యూఢిల్లీ, జూలై 7: అన్‌లాక్‌ నేపథ్యంలో కొందరు రుణగ్రహీతలు తమ ఈఎంఐ చెల్లింపులపై పెట్టుకున్న మారటోరియంను వెనక్కి తీసుకుంటున్నారని బ్యాంకర్లు చెప్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, నగదు లభ్యత పెరుగడంతో రుణాల చెల్లింపులకు ముందుకు వస్తున్నారని పేర్కొంటున్నారు. వైరస్‌ ఉద్ధృతి దృష్ట్యా మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అన్ని రకాల రుణాలపై మూడు నెలల మారటోరియంను రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించగా, ఆ తర్వాత దాన్ని ఆగస్టు వరకు పొడిగించిన సంగతీ విదితమే. అయితే కంటైన్మెంట్‌ జోన్లు మినహా అంతటా జూన్‌ నుంచి లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు మొదలవగా, అన్ని పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో సాధారణ పరిస్థితులు క్రమేణా నెలకొంటున్నాయి. ఫలితంగా పలువురు రుణగ్రహీతలు మారటోరియం నుంచి బయటకు వస్తున్నారని ఓ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ సీనియర్‌ ఉద్యోగి తెలిపారు. ముఖ్యంగా సూక్ష్మ రుణగ్రహీతలకు నగదు లభ్యత పెరిగిందని, అందుకే వారు మారటోరియంను వద్దనుకుంటున్నారని చెప్పారు. ఆగస్టు వరకు మారటోరియం అవకాశం ఉన్నా.. ఈఎంఐలను చెల్లిస్తామని వస్తున్నారంటూ సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఎండీ ఆర్‌ భాస్కర్‌ బాబు పీటీఐకి తెలిపారు. కాగా, తమ రుణగ్రహీతలందరికీ మారటోరియం అవకాశాన్నిచ్చినా.. కేవలం 30 శాతం మందే దాన్ని వినియోగించుకున్నారని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఎండీ ఎస్‌ఎస్‌ మల్లిఖార్జున రావు తెలిపారు. logo