బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Jan 23, 2020 , 00:21:02

యాక్సిస్‌ అంచనాలు మిస్‌

యాక్సిస్‌ అంచనాలు మిస్‌
  • క్యూ3లో రూ.1,757 కోట్లుగా నికర లాభం

ముంబై, జనవరి 22: ప్రైవేట్‌ రంగ ఆర్థిక సేవల సంస్థ యాక్సిస్‌ బ్యాంక్‌ ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు చేరుకోలేకపోయాయి. డిసెంబర్‌ 31తో ముగిసిన మూడు నెలలకు గాను బ్యాంక రూ.1,757 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.1,680.85 కోట్ల లాభంతో పోలిస్తే కేవలం 4.5 శాతం వృద్ధి నమోదైంది. నికర వడ్డీ ఆదాయం 15 శాతం పెరిగి రూ.6,453 కోట్లకు చేరుకున్నట్లు బ్యాంక్‌ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. సమీక్షకాలంలో బ్యాంక్‌ ఆదాయం రూ.18,130.42 కోట్ల నుంచి రూ.19,494.87 కోట్లకు పెరిగింది. బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తుల విలువ అడ్వాన్స్‌లో 5.75 శాతం నుంచి 5 శాతానికి తగ్గగా, నికర ఎన్‌పీఏ కూడా 2.36 శాతం నుంచి 2.09 శాతానికి తగ్గింది.


విలువ పరంగా చూస్తే స్థూల నిరర్థక ఆస్తుల విలువ రూ.30,854.67 కోట్ల నుంచి రూ.30,073 కోట్లకు తగ్గాయి. మొండి బకాయిలతో బ్యాంక్‌ సతమతమవుతున్నది. గత త్రైమాసికం చివరినాటికి రూ.12,160.28 కోట్ల మొండి బకాయిలు ఉన్నాయి. అంతక్రితం ఏడాదిలో రూ.12,233.29 కోట్లుగా ఉన్నాయి. కొత్తగా రూ.6,214 కోట్ల రుణాలు మొండి బకాయిల జాబితాలోకి చేరినట్లు బ్యాంక్‌ వర్గాలు వెల్లడించాయి. రూ.2,422 కోట్ల మొండి బకాయిలను వసూలు చేసిన బ్యాంక్‌..ఇదే సమయంలో రూ.2,790 కోట్ల రుణాలను రద్దు చేసింది. స్టాక్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి బ్యాంక్‌ షేరు ధర ఒక్క శాతం తగ్గి రూ.710 వద్ద ముగిసింది. 


logo