సోమవారం 01 జూన్ 2020
Business - May 08, 2020 , 02:07:05

తాయిలాలతో ఎర

తాయిలాలతో ఎర

  • 100% ఆన్‌రోడ్‌ ఫైనాన్సింగ్‌, ఇన్‌స్టాల్‌మెంట్‌ హాలిడేలు
  • వాహన కొనుగోలుదారులకు ఆటోమొబైల్స్‌ రాయితీలు

న్యూఢిల్లీ/ముంబై, మే 7: కరోనా కాటుతో గతనెల వాహన అమ్మకాల్లేక డీలాపడిన ఆటోమొబైల్‌ కంపెనీలు ఇప్పుడు వివిధ రకాల తాయిలాలతో కస్టమర్లను మళ్లీ షోరూములకు రప్పించాలని యోచిస్తున్నాయి. 100 శాతం ఆన్‌రోడ్‌ ఫైనాన్సింగ్‌, ఇన్‌స్టాల్‌మెంట్‌ హాలిడేలు, వాహన రుణచెల్లింపు హామీ పథకాల్లాంటి ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కసరత్తు చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉద్యోగాలు, వేతన కోతలతో సతమతమవుతూ ఖరీదైన కొనుగొళ్లకు దూరంగా ఉంటున్న ప్రజలకు వాహనాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాయి. లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రభుత్వం కొంతమేరకు సడలించడంతో దేశంలోని వివిధ ప్రాంతాల ఆటోమొబైల్‌ డీలర్లు ఈ వారంలో తమ షోరూములను మళ్లీ తెరిచేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం తమ వద్ద మిగిలిపోయిన దాదాపు 3 లక్షల ప్యాసింజర్‌ వాహనాలను త్వరగా అమ్మేయడంపై వీరు తొలుత దృష్టిసారించే అవకాశమున్నదని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. దేశీయ మార్కెట్లో దాదాపు సగం వాటాతో అతిపెద్ద వాహన తయారీ సంస్థగా కొనసాగుతున్న మారుతీ సుజుకీ తమ వాహన కొనుగోలుదారులకు సులభ నిబంధనలతో రుణాలిప్పించేందుకు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నది. ప్రస్తుతం ప్రజలు తమ ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ప్రజా రవాణా నుంచి వ్యక్తిగత రవాణా (పర్సనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌) వైపు మళ్లాలని భావిస్తున్నారని, అయితే వారి ఆదాయం తగ్గడంతో వాహన ఈఎంఐ భారం తక్కువగా ఉండాలని కోరుకొంటున్నారని మారుతీ సుజుకీ మార్కెటింగ్‌, సేల్స్‌ విభాగం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వాహన రుణాల కాలపరిమితిని పెంచడంతోపాటు వడ్డీరేట్లు, డౌన్‌పేమెంట్లు తక్కువగా ఉండేలా చూడాలని బ్యాంకులతో చర్చిస్తున్నట్టు ఆయన చెప్పారు.


logo