గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Mar 25, 2020 , 00:36:43

ఏటీఎం చార్జీలు రద్దు

ఏటీఎం చార్జీలు రద్దు

 • ఏ  ఏటీఎం నుంచైనా నగదు విత్‌డ్రా అవకాశం
 • జూన్‌ 30 వరకు చార్జీల భారం ఉండదు
 • ఖాతాల్లోనూ కనీస నగదు  నిల్వలు అక్కర్లేదు 
 • కరోనా వైరస్‌ నేపథ్యంలో కేంద్రం నిర్ణయం 

న్యూఢిల్లీ, మార్చి 24: ఇకపై చార్జీలు పడుతాయన్న భయంతో.. ఖాతాలున్న బ్యాంకుల ఏటీఎంల కోసం వెతుక్కోవాల్సిన అక్కెర లేదు. కనిపించిన ఏటీఎంలలో నగదును తీసుకోవచ్చు. కరోనా వైరస్‌ నేపథ్యంలో బ్యాంక్‌ ఖాతాదారులకు కేంద్రం ఊరటనిచ్చింది. వచ్చే మూడు నెలలపాటు ఇందుకుగాను ఎటువంటి చార్జీలు ఉండబోవని ప్రకటించింది. ప్రస్తుతం మెట్రో నగరాల్లో ఖాతాలున్న బ్యాంక్‌ ఏటీఎంలలో నెలకు ఐదుసార్లు, ఇతర ఏటీఎంలలో మూడుసార్లు నగదును ఉచితంగా ఉపసంహరించుకునే వెసులుబాటు ఉన్నది. అయితే ఇప్పుడీ నిబంధనల్ని తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ప్రకటించారు. ఏ బ్యాంక్‌ ఖాతాదారులైనా.. తమకు అందుబాటులో ఉన్న ఇతర ఏటీఎంలలో స్వేచ్ఛగా నగదును ఉపసంహరించుకోవచ్చని, జూన్‌ 30 వరకు చార్జీల భారం ఉండదని చెప్పారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. అలాగే ఖాతాల్లో కనీస నగదు నిల్వలనూ ఉంచనవస రం లేదని ఆమె వెల్లడించారు. మూడు నెలలపాటు ఇంతేనన్నారు. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ప్రజలెవరూ ఇబ్బందులకు గురికావద్దన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్న ఆమె.. పరిస్థితుల తీవ్రతనుబట్టి మరికొన్ని నెలలు ఈ సౌకర్యాలను పొడిగిస్తామని తెలిపారు.

జూన్‌ 30 వరకు జీఎస్టీ రిటర్నుల గడువు

జీఎస్టీ రిటర్నుల గడువును సైతం మరో మూడు నెలలు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు గాను దాఖలు చేయాల్సిన జీఎస్టీ రిటర్నులను జూన్‌ 30 వరకు చేసుకునే అవకాశం కల్పించింది. మార్చి 31లోగా ముందస్టు జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉండగా, దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌తో దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. అలాగే రూ.5 కోట్ల లోపు వార్షిక టర్నోవర్‌ కలిగిన సంస్థలు ఆలస్యంగా చెల్లించనున్న జీఎస్టీపై వడ్డీ లేదా జరిమానా మినహాయింపునిచ్చింది. రూ.5 కోట్ల అధిక టర్నోవర్‌ కలిగిన సంస్థలు మాత్రం జీఎస్టీపై 9 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. కానీ, లేట్‌ ఫీ లేదా జరిమానా నుంచి మినహాయింపునిచ్చింది. వీటితోపాటు పరిహారం స్కీంను ఎంపిక చేసుకునే కాలపరిమితిని సైతం జూన్‌ 30 వరకు పొడిగించింది. 


మరికొన్ని కీలక నిర్ణయాలు

 • 2018-19 ఐటీ రిటర్నుల దాఖలు గడువు మార్చి 31 నుంచి జూన్‌ 30కి పెంపు
 • జూన్‌లోగా చెల్లిస్తే వివాద్‌ సే విశ్వాస్‌ పథకంలో 10 శాతం అదనపు చెల్లింపులుండవ్‌
 • అడ్వాన్స్‌ ట్యాక్స్‌, టీడీఎస్‌, తదితర చెల్లింపుల ఆలస్యంపై 9 శాతానికి తగ్గిన వడ్డీరేటు
 • వడ్డీలు, జరిమానాలు, ఆలస్య రుసుములు లేవు
 • 5 కోట్లకుపైగా టర్నోవర్‌ ఉన్న సంస్థలు జూన్‌ ఆఖరు వారంలోగా రిటర్న్స్‌ దాఖలు చేసుకోవచ్చు
 • 15 రోజులు ఆలస్యమైనా 9 శాతం వడ్డీరేటే (ప్రస్తుతం 18 శాతం)
 • సబ్‌కా విశ్వాస్‌ పథకం కింద చెల్లింపుల తేదీని మార్చి నుంచి జూన్‌కు పొడిగింపు
 • ట్రేడ్‌ ఫైనాన్స్‌ కస్టమర్ల కోసం డిజిటల్‌ ట్రేడ్‌ లావాదేవీల కోసం బ్యాంక్‌ చార్జీల తగ్గింపు
 • దివాలా కేసు కనిష్ఠ పరిమితి కోటి రూపాయలకు పెంపు

ఆధార్‌-పాన్‌ లింక్‌ గడువు మూడు నెలల పెంపు

ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధానం గడువును కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పెంచింది. ఇదివరకే రెండు సార్లు పెంచిన కేంద్రం..తాజాగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ గడువును మార్చి 31 నుంచి జూన్‌ 30 వరకు పెంచుతూ మంగళవారం నిర్ణయం తీసుకున్నది. జనవరి చివరినాటికి దేశవ్యాప్తంగా 30.75 కోట్ల పాన్‌ నంబర్లు ఆధార్‌తో లింక్‌ చేసినట్లు ఐటీ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. ఐటీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వెబ్‌సైట్‌ ద్వారా పాన్‌-ఆధార్‌తో లింక్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. 

ఉద్యోగుల్ని తీసేయొద్దు

దేశ ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్‌ భీకర మందగమనంలోకి నెట్టిన నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు, వేతన కోతలకు దిగరాదని దేశీయ వ్యాపార, పారిశ్రామిక రంగాలను నిపుణులు కోరుతున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్తంభించిన ఉత్పాదక, వ్యాపార లావాదేవీల మధ్య ఆయా సంస్థలు వ్యయ నియంత్రణ చర్యలకు దిగుతున్నాయి. దీంతో మానవత్వం చూపాలని సూచిస్తున్నారు. నిజానికి మందగమన పరిస్థితుల నుంచి త్వరగా కోలుకోవాలని వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టడం సర్వసాధారణం.  

జీతాలు తగ్గించం..

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో..తన సిబ్బందికి శుభవార్తను అందించింది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ నెల చివరివరకు విమాన సర్వీసులను రద్దు చేసిన సంస్థ..తాజాగా సిబ్బంది జీతాలు లేదా జీతాల బకాయిల్లో కోత విధించబోమని సిబ్బందికి హామీ ఇచ్చింది ఇండిగో. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ నెల చివరివరకు దేశవ్యాప్తంగా విమాన సర్వీసులను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా అన్ని సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 

అమర్‌ రాజా కూడా..

బ్యాటరీల తయారీ సంస్థ అమర రాజా కూడా ఉత్పత్తిని నిలిపివేసింది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెల చివరివరకు ప్లాంట్లో ప్రొడక్షన్‌ను నిలిపివేస్తున్నట్లు ఒక ప్రకటనలలో వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను క్షుణ్ణంగా రోజువారిగా పరిశీలిస్తున్నట్లు, అవసరమైన చర్యలను తీసుకోనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 


logo
>>>>>>