పాతాళంలోకి కార్ల సేల్స్: త్రీ వీలర్స్, కమర్షియల్ దారుణం

న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం, అటుపై కరోనా మహమ్మారి ప్రభావంతో గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఆటోమొబైల్ విక్రయాల్లో వృద్ధి పూర్తిగా తిరోగమనం బాట పట్టింది. ప్రయాణికుల కార్లు మొదలు టూ, త్రీ వీలర్స్, వాణిజ్య వాహనాల వరకు అన్ని క్యాటగిరీల వాహనాల విక్రయాల్లో తిరోగమనంలో చారిత్రక రికార్డులు నమోదయ్యాయి.
ఆటో ఇండస్ట్రీ బాడీ సియాం విడుదల చేసిన డేటా ప్రకారం కార్లు, ఎస్‌యూవీలు, ఎంపీవీ/యూవీ వాహనాలతో సహా ప్రయాణికుల వాహనాల విక్రయాలన్నీ కలుపుకుని 17.8 లక్షల యూనిట్లకే పరిమితం అయ్యాయి. దశాబ్ది క్రితం 2010-11లో ప్రయాణికుల కార్ల విక్రయాలు18.1 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.
కార్ల విక్రయాలతో పోలిస్తే, ద్విచక్ర వాహనాల విక్రయాల్లో కాసింత మెరుగుదల కనిపించింది. 2013-14లో 109.4 లక్షల యూనిట్ల ద్విచక్ర వాహనాలు అమ్ముడు కాగా, గత తొమ్మిది నెలల్లో 107.7 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2013-14తో పోలిస్తే ఈ ఏడాది టూ వీలర్ విక్రయాలు అత్యంత కనిష్ఠ స్థాయికి చేరాయి.
ఇక గత తొమ్మిది నెలల్లో 1.3 లక్షల యూనిట్లు విక్రయించగా, 2000-01లో ఇంతకంటే స్వల్ప మెరుగుదలతో 1.4 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. మరోవైపు కమర్షియల్ వాహనాల విషయానికి వస్తే 2010-11లో 4.8లక్షల యూనిట్లు విక్రయిస్తే, ఈ ఏడాది అతి తక్కువగా 3.6 లక్షల యూనిట్లు మాత్రమే అమ్ముడు పోయాయి.
మారుతి సుజుకి ఎండీ కెనిచి అయుకవా మాట్లాడుతూ కార్ల విక్రయాలను పెంచుకోవడానికి ఆటో పరిశ్రమ కష్టపడి పని చేస్తున్నదని చెప్పారు. గత కొన్ని నెలలుగా విక్రయాలు మెరుగైనా, పురోగతి సాధించినట్లేనని చెప్పడం తొందరపాటే అవుతుందని సియాం అధ్యక్షుడు కూడా అయిన కెనిచి అయుకవా చెప్పారు. ఆటోమొబైల్ విక్రయాలకు విడి భాగాల కొరత కూడా ఒక కారణమేనన్నారు.
వచ్చే బడ్జెట్ ప్రతిపాదనల్లో స్క్రాపేజీ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతుందని వేచిచూస్తున్నట్లు కెనిచి అయుకవా తెలిపారు. దీనివల్ల ఇన్సెంటివ్‌ల ద్వారా కాలుష్య కారక వాహనాలను తొలగించవచ్చునన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వానికి గల పరిమిత వనరుల నేపథ్యంలో ప్రస్తుతానికి ఆటోమొబైల్ పరిశ్రమపై జీఎస్టీ తగ్గింపు డిమాండ్‌ను పక్కన బెట్టినట్లు చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.