శనివారం 08 ఆగస్టు 2020
Business - Jun 29, 2020 , 00:54:29

1 నుంచి మళ్లీ ఏపీవై ఆటో-డెబిట్‌

1 నుంచి మళ్లీ ఏపీవై ఆటో-డెబిట్‌

వచ్చే నెల 1 నుంచి అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై) లబ్ధిదారుల ఖాతాల నుంచి నెలసరి మొత్తాలను బ్యాంకులు ఆటో-డెబిట్‌ ద్వారా తీసుకోనున్నాయి. కరోనా వైరస్‌ ఉద్ధృతి, లాక్‌డౌన్‌ల దృష్ట్యా ఏప్రిల్‌ 11న ఈ ఆటో-డెబిట్‌ వ్యవస్థను పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్డీఏ) నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నెల 30దాకా ఆగిపోతాయని నాడు పీఎఫ్‌ఆర్డీఏ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జూలై 1 నుంచి ఆటో-డెబిట్‌ తిరిగి మొదలవుతుందని ఈ పథకం లబ్ధిదారులనుద్దేశించి ఓ ఈ-మెయిల్‌ను పీఎఫ్‌ఆర్డీఏ విడుదల చేసింది. సెప్టెంబర్‌ 30లోగా పెన్షన్‌ పథకం ఖాతాను పునరుద్ధరించుకుంటే అపరాధ రుసుముల నుంచి తప్పించుకోవచ్చనీ ఈ సందర్భంగా సదరు మెయిల్‌లో స్పష్టం చేసింది. సాధారణంగా ఆలస్యమైన నెలసరి మొత్తాలపై బ్యాంకులు జరిమానాలను విధిస్తాయి. అయితే ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా సెప్టెంబర్‌ 30కల్లా ఖాతాలను రెగ్యులరైజ్‌ చేసుకుంటే ఈ జరిమానాలుండవని పీఎఫ్‌ఆర్డీఏ చెప్పింది.

అటల్‌ పెన్షన్‌ యోజన అంటే?

అసంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. 18 ఏండ్ల నుంచి 40 ఏండ్లలోపు వయసున్నవారు ఈ పథకంలో మదుపు చేయవచ్చు. అయితే ఇందుకు బ్యాంక్‌ ఖాతా తప్పనిసరి. ఈ పథకం కింద రూ.1,000 నుంచి 5,000 వరకు నెలనెలా కనీస పెన్షన్‌ను పొందవచ్చు. 60 ఏండ్లు దాటిన తర్వాత ఈ పెన్షన్‌ను అందుకుంటాం. మనం ఇప్పుడు చెల్లించే నెలసరి మొత్తాల ఆధారంగానే భవిష్యత్తులో మనకు వచ్చే పెన్షన్‌ మొత్తాలు ఆధారపడి ఉంటాయి.


logo