శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Jan 15, 2021 , 19:28:59

ఇంటి రుణానికి ఇదే మోకా!

ఇంటి రుణానికి ఇదే మోకా!

న్యూఢిల్లీ: మీరు సొంతిల్లు కొనుక్కోవాలని భావిస్తున్నారా? అయితే, ఇంకెందుకు ఆలస్యం.. త్వరపడండి.. ఎందుకంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్‌ బ్యాంకులు చాలా తక్కువ వడ్డీరేటుపైనే ఇంటి రుణాలిస్తున్నాయి.  కనుక తక్కువ వడ్డీపై సొంతింటి కల సాకారం చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వాయిదాల పద్దతిలో నిర్దిష్ట సమయంలో రుణాలు చెల్లించగలిగితే ఇంటి రుణాలు సురక్షితమైనవి, సౌలభ్యకరమైనవి కూడా. 

జాయింట్ ఖాతాదారు కోసం బ్యాంకుల పట్టు

అయితే అత్యధిక బ్యాంకులు ఇంటి రుణం మంజూరు సమయంలో ప్రధాన దరఖాస్తు దారుడితోపాటు సహ-దరఖాస్తు దారుడిని చేర్చడం తప్పనిసరి చేస్తున్నాయి. కానీ కో-అప్లికెంట్‌.. కో-ఓనర్‌ కావాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని బ్యాంకులు సహ యజమాని (కో ఓనర్‌)ని సహా దరఖాస్తు దారుడిగా చేర్చాల్సిందేనని పట్టుబడుతున్నాయి. అయితే, జాయింట్ అక్కౌంట్ ద్వారా రుణం తీసుకోవడం వల్ల బోలెడు లాబాలు కూడా వున్నాయి.

రుణం చెల్లిస్తే ఎంతో హాయి ఇలా..

అయితే సహ యజమానికి ఆస్తి (ఇల్లు)లో వాటా ఉంటుంది. ప్రాథమిక దరఖాస్తు దారుడు సకాలంలో వాయిదాలు చెల్లించకుంటే, సహ దరఖాస్తు దారు చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే, దరఖాస్తు దారు, సహ దరఖాస్తు దారు పేర్లను ఇంటి రుణంలో చేర్చడం వల్ల టాక్స్‌ బెనిఫిట్‌ లభిస్తుంది. 

పన్ను రాయితీలకు జాయింట్ లోన్

చాలా మంది వ్యక్తులు పన్ను రాయితీలు పొందడానికి మాత్రమే జాయింట్‌ లోన్ తీసుకుంటున్నారు. ఒకవేళ ఎక్కువ మొత్తంలో రాయితీ పొందాలనుకుంటే జాయింట్‌ లోన్‌తో మాత్రమే సాధ్యం. దీనివల్ల భార్యాభర్తలు ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్‌ కింద రూ.1,5 లక్షల చొప్పున రూ.3 లక్షల మినహాయింపు పొందొచ్చు. సెల్ఫ్‌ ఆక్యుపైడ్‌ ఇల్లు అయితే, ఐటీ చట్టంలోని 24 సెక్షన్‌ ప్రకారం రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.4 లక్షల రుణంపై వడ్డీ రాయితీ లభిస్తుంది. 

రూ.60 లక్షల వరకూ రుణం..

మీ భార్యాభర్తల ఇద్దరి ఆదాయం ఆదాయం ఆధారంగానే గరిష్ట ఇంటి రుణాన్ని బ్యాంకు మంజూరు చేస్తుంది. వ్యక్తిగతంగా రూ.30 లక్షల వరకు ఇంటి రుణం పొందొచ్చు. జీవితభాగస్వామితో కలిసి రూ.60 లక్షల వరకు రుణం పొందడానికి వెసులుబాటు ఉంటుంది. 

మహిళకు బ్యాంకుల ప్రత్యేక రాయితీలు

అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐతో సహా పలు బ్యాంకులు మహిళా దరఖాస్తు దారులకు తక్కువ వడ్డీరేటుపై ఇంటి రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఒకవేళ మీరు ఇంటి రుణం తీసుకోవాలనుకుంటే మీ భార్యను ప్రాథమిక దరఖాస్తు దారుగా చేర్చండి.. తద్వారా తక్కువ వడ్డీరేటుపై రుణం పొందండి. 

స్టాంప్ డ్యూటీలో రాయితీలు ఇలా..

అలాగే కొన్ని రాష్ట్రాలు మహిళలు, దంపతుల పేరుపై ఇండ్ల రిజిస్ట్రేషన్‌ మీద స్టాంప్‌ డ్యూటీ మినహాయింపునిస్తున్నాయి. అయితే, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మహిళ పేరిట ఇండ్ల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్‌ డ్యూటీ ఇతర మినహాయింపుల్లో తేడా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo