బుధవారం 27 మే 2020
Business - May 20, 2020 , 23:44:41

మరో ఆర్నెళ్లు ఇంటి నుంచే పని

మరో ఆర్నెళ్లు ఇంటి నుంచే పని

  • 70 శాతానికి పైగా సంస్థలు ‘వర్క్‌ ఫ్రం హోమ్‌'కే ఓటు 
  • నైట్‌ ఫ్రాంక్‌ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ, మే 20: కరోనా వైరస్‌ కంపెనీల పనితీరునే మార్చేసింది. ఈ అంటువ్యాధిని ఎదుర్కొనేందుకు ఇన్నాళ్లూ తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయించిన సంస్థలు.. ఇకపైనా దాన్నే కొనసాగించాలని చూస్తున్నాయి. నైట్‌ ఫ్రాంక్‌ నిర్వహించిన తాజా సర్వేలో 70 శాతానికిపైగా సంస్థలు వచ్చే ఆర్నెళ్లూ ఇంటి నుంచే ఉద్యోగులను పని చేయించే అవకాశాలున్నట్లు తేలింది. వివిధ రంగాల్లోని భారీ శ్రేణి సంస్థల్లో కార్పొరేట్‌ రియల్‌ ఎస్టేట్‌ పోర్ట్‌ఫోలియోను చూస్తున్న 230కిపైగా ఉద్యోగుల అభిప్రాయాలను నైట్‌ ఫ్రాంక్‌ ఈ సర్వేలో సేకరించింది. లాక్‌డౌన్‌లో వర్క్‌ ఫ్రం హోమ్‌ వల్ల తమ సంస్థల ఉత్పత్తిపై ఏరకమైన ప్రభావం పడలేదని ఈ సందర్భంగా మెజారిటీ ఉద్యోగులు అన్నారు. 26 శాతం మంది ఉత్పత్తి తగ్గిందన్నారు. కరోనా కట్టడి కోసం మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల ఆరంభం నుంచి కొన్ని సడలింపులు ఇవ్వగా, రెడ్‌ జోన్లలో మాత్రం కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ నడుస్తున్న సంగతీ విదితమే. కాగా, మారుమూల ప్రాంతాల్లోని ఉద్యోగులతో పని చేయించుకుంటున్న సమయంలో కొంత ఇబ్బంది పడ్డామని ఆయా సంస్థలు తెలిపాయి. అయినప్పటికీ భౌతిక దూరం నిబంధనలు, బస్సుల కొరత, ప్రయాణాల్లో ఇబ్బందుల దృష్ట్యా 72 శాతం సభ్యులు వర్క్‌ ఫ్రం హోమ్‌కే మద్దతు పలికారని సర్వే స్పష్టం చేసింది. తమ ఉద్యోగుల్లో 30 శాతానికిపైగా వచ్చే ఆర్నెళ్లు ఇంటి నుంచే పనిచేస్తారని సర్వేలో పాల్గొన్న దాదాపు 50 శాతం మంది చెప్పారు. కేవలం 7 శాతం మంది ఎవరూ వర్క్‌ ఫ్రం హోం ఉండరని అన్నట్లు నైట్‌ ఫ్రాంక్‌ తెలియజేసింది. ఇక ప్రస్తుత ఆఫీస్‌ స్పేస్‌ పోర్ట్‌ఫోలియోను యథాతథంగా లేదా 24 శాతం పెంచవచ్చని సుమారు 62 శాతం మంది అభిప్రాయపడ్డారు. 


logo