న్యూఢిల్లీ, ఆగస్టు 6: ప్రసిద్ధ విమాన తయారీ సంస్థ బోయింగ్ నుంచి ఈ వారంలోనే హైదరాబాద్‌కు రెండో కాంట్రాక్టు లభించింది. బోయింగ్ 737 విమానాల కోసం ఫ్యాన్ కౌల్ డోర్స్ ఉత్పత్తిచేసే కాంట్రాక్టును పొందినట్లు టాటా గ్రూప్ కంపెనీ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (టీఏఎస్ఎల్) శుక్రవారం ప్రకటించింది. బోయింగ్ విడిభాగాల తయారీ కోసం హైదరాబాదీ ఏరోస్పేస్ కంపెనీ రఘువంశీ ఈ వారంలో భారీ కాంట్రాక్టును పొందిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో తమకు ఉన్న అత్యాధునిక ప్లాంటులో కౌల్ డోర్స్ ఉత్పత్తి చేయనున్నట్లు టీఏఎస్ఎల్ తెలిపింది. బోయింగ్ 737కు నెలకు అవసరమైన ఫ్యాన్ కౌల్ డోర్స్‌లో 50 శాతం 2025 ఆర్థిక సంవత్సరం నుంచి సరఫరా చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.
విమానాల రెక్కల కింద ఇరువైపులా ఉండే ఇంజన్లు సున్నితంగా పనిచేసేందుకు అమర్చే ఫ్యాన్ల కేస్‌ను ఫ్యాన్కౌల్గా వ్యవహరిస్తారు. ఈ కౌల్ ఇంజను విడిభాగాలకు రక్షణ కల్పిస్తుంది. అలాగే ప్రతీ ఇంజనుకు కుడి, ఎడమభాగాల్లో రెండు ఫ్యాన్ కౌల్ డోర్స్ ఉంటాయి. వీటిని తెరిచి ఇంజను విడిభాగాల్ని సర్వీస్ చేస్తారు.
అంతర్జాతీయ పోటీలో ఈ కాంట్రాక్టు తమకు లభించిందని టీఏఎస్ఎల్ ఎండీ సుకరణ్ సింగ్ చెప్పారు. బోయింగ్, ఇతర గ్లోబల్ ఏరోస్పేస్ కంపెనీల నుంచి లభించిన కాంట్రాక్టుల ద్వారా సామర్థ్యాల్ని పెంచుకోగలిగామని, ఇప్పుడు పూర్తిగా విమానాన్ని లేదా హెలికాప్టర్‌ను ఇండియాలో తయారుచేసే సామర్థ్యం టీఏఎస్‌ఎల్‌కు ఉందన్నారు. నాగ్‌పూర్, బెంగళూరు, హైదరాబాద్‌ల్లో ఉన్న ఉత్పాదక సదుపాయాల్లో బోయింగ్‌కు కీలక విడిభాగాల్ని వేలాదిగా టీఏఎస్ఎల్ ఉత్పత్తి చేస్తున్నది. తెలంగాణలోని టాటా-బోయింగ్ జాయింట్ వెంచర్.. అపాచీ హెలికాప్టర్లకు ఫ్యూజ్‌లాజెస్ ఉత్పత్తి చేస్తుండగా, ఇటీవల బోయింగ్ 737 విమానాలకు వెర్టికల్ ఫిన్ స్ట్రక్చర్స్ ఉత్పత్తిచేసేందుకు ఒక కొత్త ప్రొడక్షన్లైన్ నెలకొల్పింది.