బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Mar 16, 2020 , 23:41:13

అనిల్‌ అంబానీకి సమన్లు

అనిల్‌ అంబానీకి సమన్లు
  • యెస్‌ బ్యాంక్‌ సంక్షోభం కేసులో మరో నలుగురికీ జారీ చేసిన ఈడీ
  • 19న హాజరుకావాల్సిందేనని ఆదేశం

న్యూఢిల్లీ/ముంబై, మార్చి 16: అనిల్‌ అంబానీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యెస్‌ బ్యాంక్‌ సంక్షోభానికి సంబంధించిన కేసులో అడాగ్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఇదివరకే అరస్టైన యెస్‌ బ్యాంక్‌ ప్రమోటర్‌ రాణా కపూర్‌లను విచారిస్తున్న ఈడీ..తాజాగా అనిల్‌ అంబానీకి సమన్లు జారీ చేయడం మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ మేరకు ముంబైలోని బాలార్డ్‌ ఎస్టేట్‌ ప్రాంతంలో ఈడీ కార్యాలయానికి హాజరుకావాలని అనిల్‌ అంబానీని ఆదేశించినప్పటికీ అనారోగ్య కారణాల వల్ల హాజరుకాలేనని అనిల్‌ పేర్కొన్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. యెస్‌ బ్యాంక్‌ వద్ద అనిల్‌ అంబానీకి సంబంధించిన పలు కంపెనీలు రూ.12 వేల కోట్లకు పైగా రుణాలు తీసుకొని తిరిగి చెల్లింపులు జరుపడంలో విఫలమయ్యారు. ప్రస్తుతం ఇవి నిరర్థక ఆస్తుల జాబితాలోకి చేరాయి. 60 ఏండ్ల వయస్సు కలిగిన అనిల్‌ అంబానీని ఈ నెల 19న హాజరుకావాల్సిందేనని స్పష్టంచేసింది. మరోవైపు యెస్‌ బ్యాంక్‌ వద్ద తీసుకున్న రుణాలకు పూర్తిస్థాయి తాకట్టు కింద ఉన్నాయని గతవారం రిలయన్స్‌ వెల్లడించింది. బ్యాంక్‌ వద్ద తీసుకున్న రుణాలను తిరిగి చెల్లింపుల జరుపడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇదివరకే సంస్థ ప్రకటించింది. కాగా, అనిల్‌తోపాటు యెస్‌ బ్యాంక్‌ నుంచి రుణాలు పొందిన అన్ని సంస్థలకు సమన్లు జారీ చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. విడుతలవారీగా ఒక్కోక్కరిని ప్రశ్నించనున్నట్లు తెలిపాయి. 

మాస్క్‌తో రాణా కపూర్‌ 

కరోనా వైరస్‌ నేపథ్యంలో రాణా కపూర్‌ మాస్క్‌తో కనిపించారు. కపూర్‌ కస్టడి ముగియడంతో ప్రాంతీయ కోర్టులో హాజర్‌ పరిచిన ఈడీ..ఆయన కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగించింది. అంతకుమందు ఆయనను మెడికల్‌ చెకప్‌ నిమిత్తం స్థానిక హాస్పిటల్‌లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కపూర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు రూ.4,300 కోట్ల ముడుపులు అందుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఈడీ వీరిపై  క్రిమినల్‌ కేసును దాఖలు చేసింది. 


logo