శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Mar 19, 2020 , 23:48:37

ఈడీ ఎదుట అంబానీ

ఈడీ ఎదుట అంబానీ

-యెస్‌ బ్యాంకు కేసులో అనిల్‌ను 9 గంటలు ప్రశ్నించిన అధికారులు

-30న మళ్లీ రావాలని ఆదేశం

ముంబై, మార్చి 19: రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ (60) గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. యెస్‌ బ్యాంక్‌ ప్రమోటర్‌ రాణాకపూర్‌, ఇతరులపై దాఖలైన మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా అనిల్‌ అంబానీని సుదీర్ఘంగా 9 గంటలపాటు ప్రశ్నించి, మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో మళ్లీ ఈ నెల 30న తమ ఎదుట హాజరుకావలసిందిగా అనిల్‌ను ఆదేశించినట్టు వారు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్‌ సమావేశాల కారణంగా బుధవారం ఈడీ విచారణకు దూరంగా ఉన్న ఎస్సెల్‌ గ్రూప్‌ చైర్మన్‌, రాజ్యసభ ఎంపీ సుభాష్‌చంద్రను ఈ నెల 21న విచారణకు హాజరుకావలని ఆదేశిస్తూ తాజాగా సమన్లు జారీచేసినట్టు చెప్పారు. గురువారం ఉదయం 9.30 గంటలకు ముంబైలో ఈడీ కార్యాలయానికి వచ్చిన అనిల్‌ అంబానీ.. రాత్రి దాదాపు 7 గంటల సమయంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనిల్‌ అంబానీ గ్రూపునకు చెందిన తొమ్మిది కంపెనీలు సంక్షుభిత యెస్‌ బ్యాంకు నుంచి దాదాపు రూ.12,800 కోట్ల రుణాలను తీసుకొన్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ సంస్థలన్నీ పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్టు సమాచారం. 


logo