శుక్రవారం 05 జూన్ 2020
Business - Apr 01, 2020 , 09:29:30

ఆంధ్రా బ్యాంక్... నేటి నుంచి యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

 ఆంధ్రా బ్యాంక్... నేటి నుంచి యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఆంధ్రా బ్యాంకు..ఇక నుంచి బ్యాంకింగ్ సేవ‌లో ఈ పేరు వినిపించ‌దు. ల‌క్ష‌లాది మంది ఖాతాదారుల‌కు సేవ‌లందించిన ఈ బ్యాంకు.. నేటి నుంచి  యూనియ‌న్ బ్యాంకు ఆఫ్ ఇండియాగా మార‌బోతుంది. ఎందుకంటే ఆంధ్రాబ్యాంకు UBIలో విలీన‌మ‌వుతోంది. తెలుగు వాళ్ల‌కు  బ్యాంకింగ్‌లో ఎంతో సేవ‌లందించి..త‌న అనుబంధాన్ని పెంచుకున్న ఆంధ్రాబ్యాంకును స్థాపించింది కూడా తెలుగువాడే. తెలుగు నేలపై పురుడుపోసుకున్న ఏకైక జాతీయ బ్యాంకు ఆంధ్రాబ్యాంక్ కావ‌డం విశేషం.  స్వాతంత్ర్య సమరయోధులు డాక్టర్. భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్రాబ్యాంకును కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరు ప్రధాన కేంద్రంగా స్థాపించారు. 

రూ. 10 లక్షల అధీకృత మూలధనం (ఆథరైజ్డ్ క్యాపిటల్‌)తో 1923 న‌వంబ‌ర్‌లో ప్రారంభ‌మైన ఈ బ్యాంకు..భార‌తీయ బ్యాంకింగ్ రంగానికి సాంకేతిక‌త‌ను ప‌రిచ‌యం చేసింది. 1980లో ఈ బ్యాంకును జాతీయం చేశారు. జాతీయం చేసే నాటికి ఆంధ్రాబ్యాంకు 974 పూర్తిస్థాయి శాఖలు, 40 క్లస్టర్ బ్రాంచ్‌లు, 76 ఎక్స్‌టెన్షన్ కౌంటర్లు ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,904 శాఖలు ఉండ‌గా... 21,740 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇక దేశంలోనే తొలిసారి క్రెడిట్ కార్డుల‌ను జారీచేసిన చ‌రిత్ర కూడా ఆంధ్రాబ్యాంకుదే.  2003 నాటికి వంద‌ శాతం కంప్యూటరీకరణ సాధించింది. అటు 2007లో బయోమెట్రిక్ ఏటీఎంలను ఇండియాకు పరిచయం చేసింది ఆంధ్రా బ్యాంక్. 97 సంవ‌త్స‌రాలు సేవ‌లందించి.. ఎన్నో రికార్డులను  సృష్టించిన ఆంధ్రా బ్యాంకు ఇప్పుడు కనుమరుగు కాబోతోంది. యూనియ‌న్ బ్యాంక్‌లో విలీన ప్ర‌క్రియ ఈ రోజే మొదలుకాబోతోంది. 

ఆంధ్రాబ్యాంకుతో పాటు కార్పొరేషన్‌ బ్యాంకు కూడా యూనియన్ బ్యాంక్‌లో విలీనం అవుతోంది. కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్-OBC, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-UBI, కెనెరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకులో అలాహాబాద్ బ్యాంక్ విలీనం కానున్నాయి.


logo