బుధవారం 01 ఏప్రిల్ 2020
Business - Jan 13, 2020 , 00:40:57

ఫలితాలే దిక్సూచి

ఫలితాలే దిక్సూచి
  • ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాలు కూడా..
  • ఈ వారం స్టాక్‌ మార్కెట్లపై విశ్లేషకుల అంచనా

న్యూఢిల్లీ, జనవరి 12: గతవారంలో తీవ్ర ఒడిదుడుకులకు గురైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈవారంలో దేశీయ స్థూల ఆర్థికాంశాలు ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు, దీర్ఘకాలికంగా వాయిదాపడుతూ వచ్చిన అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కొలిక్కి రానుండటం వంటి అంశాలు మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను ఈవారంలో బ్లూచిప్‌ సంస్థలు తమ ఆర్థిక ఫలితాలను విడుదల చేయనుండటం, బడ్జెట్‌లో తీసుకోబోయే నిర్ణయాలు కూడా చాలా కీలకమని ట్రేడింగ్‌బెల్స్‌ సీనియర్‌ రీసర్చ్‌ విశ్లేషకులు సంతోష్‌ మీనా తెలిపారు.  ఈవారంలోనే విప్రో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతోపాటు 75 సంస్థలు తమ మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలను ప్రకటించిన ఇన్ఫోసిస్‌ షేరు ధర సోమవారం ప్రారంభంలోనే భారీగా పుంజుకునే అవకాశాలున్నాయని, ముఖ్యంగా అలాగే ఆడిట్‌ కమిటీ నివేదిక కూడా అనుకూలంగా రావడం సానుకూల పరిణామమని పేర్కొన్నారు. క్యూ3లో కంపెనీ నికర లాభం 23.7 శాతం పెరిగి రూ.4,466 కోట్లుగా నమోదైంది. వీటితోపాటు సోమవారం రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానుండటం, ఆమరుసటి రోజే టోకు ధరల సూచీ గణాంకాలు విడుదల కానుండటం ఈ ప్రభావం మార్కెట్లపై ఉండనున్నది.

ఆరు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్న రిటైల్‌ ధరల సూచీ మరింత పెరిగే ప్రమాదం ఉన్నదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత విడుదలైన పారిశ్రామిక ప్రగతి గణాంకాలు కూడా మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపనున్నాయి. గతవారంలో సెన్సెక్స్‌ 135.11 పాయింట్లు లాభపడి 41,464.61కి చేరుకోగా, నిఫ్టీ 12,311.20 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. వీటికితోడు డాలర్‌తో పోలిస్తే రూపాయి శ్రేణి, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు కూడా మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాల్లో ఇవి కూడా. ఒక దశలో 70 డాలర్ల స్థాయికి చేరుకున్న క్రూడాయిల్‌ క్రమంగా శాంతించడంతో ప్రస్తుతం 65 డాలర్ల స్థాయిలో కదలాడుతున్నది.

32 వేల కోట్లు పెరిగిన బ్లూచిప్‌ సంస్థలు

స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడిదుడులకులకు లోనైనప్పటికీ బ్లూచిప్‌ సంస్థల విలువ మాత్రం అమాంతం పెరుగుతున్నది. గతవారంలో టాప్‌-10 సంస్థల్లో ఏడింటి నికర విలువ రూ.32 వేల కోట్ల మేర పెరిగింది. వీటిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లు అత్యధికంగా లాభపడగా..టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంకుల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ అధికమైంది. కానీ, ఇన్ఫోసిస్‌, ఎస్బీఐ, ఐటీసీలు మాత్రం నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎం-క్యాప్‌ రూ. 8,270.31 కోట్లు అందుకొని రూ. 7,02,812.11 కోట్లకు చేరుకున్నది. అలాగే ఆర్‌ఐఎల్‌ రూ.6,624.47 కోట్లు పెరుగగా, హెచ్‌యూఎల్‌ రూ.5,412.03 కోట్లు, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ రూ.5,092.82 కోట్లు, టీసీఎస్‌ రూ.5,046.96 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.985.65 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ రూ.587.87 కోట్ల చొప్పున పెరిగాయి. మరోవైపు ఇన్ఫోసిస్‌ రూ.3,336 కోట్లు కోల్పోగా, ఎస్బీఐ రూ.1,338.69 కోట్లు, ఐటీసీ రూ. 553.10 కోట్ల చొప్పున కోల్పోయాయి.


logo
>>>>>>