సోమవారం 06 ఏప్రిల్ 2020
Business - Jan 27, 2020 , 00:44:13

బడ్జెట్‌ నిర్ణయాలే కీలకం

బడ్జెట్‌ నిర్ణయాలే కీలకం
  • ఈ వారం స్టాక్‌ మార్కెట్లపై విశ్లేషకుల అంచనా

న్యూఢిల్లీ, జనవరి 26: వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెటే ఈ వారం స్టాక్‌ మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నది. వీటితోపాటు బ్లూచిప్‌ సంస్థల ఆర్థిక ఫలితాలు, వడ్డీరేట్లపై అమెరికా ఫెడరల్‌ రిజర్వు తీసుకోనున్న నిర్ణయాలు కూడా మార్కెట్లపై ప్రభావితం చేయనున్న కీలక అంశాలని దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నారు. ప్రస్తుత నెలకుగాను డెరివేటివ్‌ కాంట్రాక్టు గడువు ఈవారంలో ముగియనుండటంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.  


చైనాలో ప్రబలిని కరోనావైరస్‌పై మదుపరులు దృష్టి సారించనున్నారు. ఈ వైరస్‌ సోకి ఇప్పటి వరకు చైనాలో 56 మంది మరణించారు. ఈవారంలో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావచ్చునని, కేంద్ర బడ్జెట్‌ కంటే ముందుగా ప్రస్తుత నెలకుగాను ఎఫ్‌అండ్‌ వో గడువు పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నదని జియోజిట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసుల హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. గత త్రైమాసికానికిగాను కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు, అమెరికా ఫెడ్‌, ఇంగ్లాండ్‌ రిజర్వుబ్యాంకుల పరపతి సమీక్షపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు చెప్పారు. 


వీటితోపాటు అమెరికా క్యూ4 వృద్ధిరేటు, దేశీయ ద్రవ్యలోటు గణాంకాలు కూడా సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నాయి. బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్‌, మారుతి సుజుకీ, బజాజ్‌ ఆటో, డాక్టర్‌ రెడ్డీస్‌లు తమ మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఈ వారంలోనే విడుదల చేయబోతున్నాయి. ఇదివరకు ఫలితాలు ప్రకటించిన కార్పొరేట్‌ సంస్థల విశ్లేషకుల అంచనాలకు చేరుకోకపోవడం, ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్‌ సంస్థలు నిరాశాజనక ఫలితాలు కొనసాగుతుండటంతో మార్కెట్లపై ఒత్తిడిని పెంచనున్నదన్నారు.  


వడ్డీరేట్లకు సంబంధించి యూఎస్‌ ఫెడ్‌ తన నిర్ణయాన్ని ఈ గురువారం ప్రకటించబోతున్నది. అలాగే, డాలర్‌తో పోలిస్తే రూపాయి ట్రెండ్‌, అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధరల శ్రేణి కూడా మార్కెట్లో సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నది. గతవారంలో సెన్సెక్స్‌ 332 పాయింట్లు పతనం చెందింది. ఆరేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన వృద్ధికి ఊతమివ్వడానికి 2020-21 ఏడాదికిగాను ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌లో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని మదుపరులు భావిస్తున్నారు. 


ఎఫ్‌పీఐల రూ.1,624 కోట్ల పెట్టుబడి

ఎఫ్‌పీఐల పెట్టుబడులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుత నెలలో ఇప్పటి వరకు దేశీయ క్యాపిటల్‌ మార్కెట్లోకి  విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ)లు రూ.1,624 కోట్ల మేర నిధులు చొప్పించారు. వాణిజ్య యుద్ధంపై అమెరికా-చైనా దేశాల మధ్య తొలి దశ ఒప్పందం కుదరడంతో ఎఫ్‌పీఐలు నిధులు కుమ్మరిస్తున్నారు. తాజాగా డిపాజిటరీ వద్ద ఉన్న సమాచారం మేరకు జనవరి 1 నంచి 24 మధ్యకాలంలో  ఈక్విటీ మార్కెట్లోకి రూ.13,304 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌పీఐలు..డెబిట్‌ మార్కెట్ల నుంచి మాత్రం రూ.11,680 కోట్ల నిధులను ఉపసంహరించుకున్నారు. దీంతో నికరంగా రూ.1,624 కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు అయింది. 


నూతన సంవత్సరం ప్రారంభంలో నిధులను వెనక్కితీసుకున్న ఎఫ్‌పీఐలు..అమెరికా-చైనా దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం కొలిక్కిరావడంతో ఎఫ్‌పీఐలు ఝులం విదిల్చారని మార్నింగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వయిజరీ ఇండియా మేనేజర్‌ హిమాన్షు శ్రీవాత్సవ తెలిపారు. వీటితోపాటు అమెరికా-ఇరాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కూడా తగ్గుముఖం పట్టడం, మరోవైపు దేశ ఆర్థిక మందగమన పరిస్థితులున్నప్పటికీ పెట్టుబడుల్లో మాత్రం తగ్గలేదని ఆయన పేర్కొన్నారు. డెబిట్‌ మార్కెట్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులపై నియంత్రణ ఎత్తివేసిన నాటి నుంచి ఎఫ్‌పీఐలు భారీగా పెట్టుబడులు పెడుతున్నారని, భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. 


logo