బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Mar 16, 2020 , 00:43:50

కరోనాయే కీలకం!

కరోనాయే కీలకం!
  • ఈవారం స్టాక్‌ మార్కెట్లపై విశ్లేషకుల అంచనా

న్యూఢిల్లీ: కరోనా.. కరోనా.. కరోనా..ఇప్పుడు స్టాక్‌ మార్కెట్లను పట్టిపీడిస్తున్న మహమ్మారి. ఈ వైరస్‌ దెబ్బకు గతవారంలో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు ఈవారంలోనూ తీవ్ర ఆటుపోటులకు గురికావచ్చునని దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. గతవారం చివర్లో స్వల్పంగా కోలుకున్నప్పటికీ..భారత్‌లో కరోనా వైరస్‌తో మరొకరు మరణించడం, ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్యరోజు రోజుకు పెరుగుతుండటం మార్కెట్‌ వర్గాల్లో ఆందోళనను రెకేత్తిస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలడంతో గతవారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 3,473.14 పాయింట్లు లేదా 9.24 శాతం నష్టపోగా, జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ కూడా 1,034.25 పాయింట్లు లేదా 9.41 శాతం పతనం చెందింది. గత శుక్రవారం ప్రారంభంలో మూడు వేల పాయింట్లకు పైగా నష్టపోవడంతో స్టాక్‌ మార్కెట్లను 45 నిమిషాలపాటు నిలిపివేశారు. గత 12 ఏండ్లలో ఇదే తొలిసారి నిలిపివేయడం. తిరిగి ప్రారంభమైన సూచీలు కదం తొక్కుతూ లాభాల్లో పయనించాయి. 


కరోనా వైరస్‌ రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి అంతర్జాతీయ బ్యాంకులు, ప్రభుత్వాలు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తుండటం, మరోవైపు వడ్డీరేట్లపై అమెరికా ఫెడరల్‌ రిజర్వు ఈవారంలోనే తన నిర్ణయాన్ని ప్రకటనపై మదుపరులు ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉన్నదని జియోజిట్‌ ఫైనాన్షియల్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అభిప్రాయపడ్డారు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైనప్పటికీ భవిష్యత్తులో తీవ్ర ఒడిదొడుకులకు లోనుకావచ్చునన్నారు. సోమవారం టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానుండటంతో ఈ గణాంకాలపై మదుపరులు దృష్టి సారించే అవకాశాలున్నాయి. ఉద్దీపన ప్యాకేజీలతో గ్లోబల్‌ మార్కెట్లకు తాత్కాలిక ఉపశమనం లభించనున్నప్పటికీ దీర్ఘకాలికంగా మాత్రం మదుపరుల్లో ఆందోళన మరింత పెరిగేందుకు ఆస్కారం ఉన్నదని చెప్పారు. ఈ వారంలోనే రెండు రోజులు స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో భారీ పతనాన్ని చవిచూశాయి. గత నాలుగు సెషన్లలో మదుపరులు ఏకంగా రూ.15 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. 


logo