శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Mar 21, 2020 , 22:55:53

పాల కొరత ఉండదు

పాల కొరత ఉండదు

దొరకవేమోనని భయపడి  ఎక్కువగా కొనొద్దు

వినియోగదారులకు అమూల్‌ సూచన

న్యూఢిల్లీ, మార్చి 21: మార్కెట్‌లో పాలు, ఇతర పాల ఉత్పత్తుల కొరత ఉండబోదని అమూల్‌ తెలిపింది. దొరకవేమోనన్న భయంతో ముందే ఎక్కువగా కొనుగోలు చేయవద్దని వినియోగదారులకు సూచించింది. భారత్‌లోనూ కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అనవసరంగా బయటకు రావద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే చెప్తున్న విషయం తెలిసిందే. ఆదివారం జనతా కర్ఫ్యూను కూడా అమలు చేస్తుండగా, కస్టమర్లు పాలు, పెరుగు ప్యాకెట్ల ముందస్తు కొనుగోళ్లకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం అమూల్‌ బ్రాండ్‌ మాతృ సంస్థ గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఎండీ ఆర్‌ఎస్‌ సోధి.. భయాలకు లోనై అపరిమిత కొనుగోళ్లకు దిగవద్దని వినియోగదారులను కోరారు. పాల ఉత్పత్తులకు కొరతే రాదన్నారు. రికార్డు స్థాయిలో ఉత్పత్తిని చేస్తున్నట్లు చెప్పారు. పాల ఉత్పత్తి, శుద్ధి, పంపిణీలపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. ఇప్పటికే 15-20 శాతం పాల సరఫరాను పెంచామన్నారు. కాబట్టి రేపు దొరకవేమోనని ఈరోజే కొనవద్దంటూ ట్విట్టర్‌లో ఆయన ఓ వీడియో సందేశం ఇచ్చారు. ఇప్పటికే మదర్‌ డైరీ కూడా పాల ఉత్పత్తిలో కొరత రాబోదని ప్రకటించిన విషయం తెలిసిందే.


logo