మంగళవారం 01 డిసెంబర్ 2020
Business - Oct 26, 2020 , 12:33:34

ఆ కేసులో అమెజాన్ కు ఊరట....

 ఆ కేసులో అమెజాన్ కు ఊరట....

ఢిల్లీ : ఫ్యూచర్ గ్రూప్-రిలయన్స్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ బిజినెస్ వ్యాపారాన్ని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఆర్ వీఎల్)కు రూ.24,713 కోట్లకు విక్రయించడంపై అమెజాన్ ఆర్బిట్రేషన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక్కడ అమెజాన్‌కు ఊరట లభించింది. సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ సానుకూలంగా స్పందించింది. ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అమెజాన్‌కు తాత్కాలిక ఊరట లభించింది. ఆర్బిట్రేషన్ మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది.

 సరైన న్యాయసలహా ప్రకారం ఫ్యూచర్ రిటైల్‌కు చెందిన వ్యాపారాలను ఆర్ ఆర్ వీఎల్ సొంతం చేసుకునే దిశగా ముందుకు సాగిందని, భారతీయ చట్టాల ప్రకారం అమలు జరుగుతుందని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్ ఆర్ వీఎల్ ఒప్పందం మేరకు నడుచుకుంటుందని, ఈ డీల్‌కు సంబంధించి పూర్తి ట్రాన్సాక్షన్స్ పూర్తి చేయాలని భావిస్తోందని, ఫ్యూచర్ గ్రూప్‌తో ఒప్పందం ఆలస్యం చేయకుండా పూర్తి చేసుకుంటామని ఆర్ ఆర్ వీఎల్ తెలిపింది.

ఆర్ ఆర్ వీఎల్ తో రూ.24,700 కోట్ల ఒప్పందాన్ని విరమించుకుంటే మరో బలమైన,స్థిరమైన పెట్టుబడిదారుని తీసుకురావడంలో ఫ్యూచర్ గ్రూప్‌కు సహకరిస్తామని అమెజాన్ ఇండియా ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌తో రూ.24,700 కోట్ల ఒప్పందాన్ని రద్దుచేసుకుంటే కొత్త భాగస్వామిని తీసుకువస్తామని లేదా పెట్టుబడి సంస్థలను తీసుకువస్తామని ఫ్యూచర్ గ్రూప్‌కు అమెజాన్ ఆఫర్ చేసింది. ఫ్యూచర్ కూపన్స్ ప్రయివేట్ లిమిటెడ‌లో అమెజాన్‌కు 49 శాతం వాటా ఉంది. 2019లో దాదాపు రూ.1430 కోట్లను దీనిని కొనుగోలు చేసింది. 

రిలయన్స్ ఇండస్ట్రీస్-ఫ్యూచర్ గ్రూప్ మధ్య కుదిరిన ఒప్పందం వల్ల భారత్‌లో తమకు పోటీ మరింత ఎక్కువ అవుతుందనే భావన అమెజాన్‌లో ఉందని భావిస్తున్నారు. అందుకే ఫ్యూచర్ గ్రూప్‌ను ఆదుకునేందుకు అమెజాన్ ఆసక్తి చూపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ రుణ సంక్షోభంలో చిక్కుకోవడంతో రిలయన్స్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందానికి అమెజాన్ ద్వారా చిక్కులు వచ్చాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్-ఫ్యూచర్ గ్రూప్ డీల్‌ను ఆర్బిట్రేషన్‌కు లాగింది అమెజాన్. ఫ్యూచర్ గ్రూప్‌తో తమతో కుదుర్చుకున్న ఒప్పందానికి రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ డీల్ విరుద్ధమని సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను(ఎస్ఐఏసీ) ఆశ్రయించింది. నిబంధనల ఉల్లంఘనకుగాను ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్‌కు లీగల్ నోటీసులు పంపించింది. ఈ డీల్‌ను నిలుపుదల చేయాలని కోరింది. దీంతో అమెజాన్‌కు తాత్కాలిక ఊరట లభించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.