Amazon Telugu Registration | పండుగల సీజన్ ప్రారంభమవుతున్న వేళ.. గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా విక్రేతలకు వెసులుబాటు కల్పించింది. తెలుగుతోపాటు ఎనిమిది స్థానిక భాషల్లో విక్రేత రిజిస్ట్రేషన్, మేనేజ్మెంట్ సర్వీసు ఖాతాల నిర్వహణను ప్రారంభించింది. ప్రాంతీయ భాషల్లో సెల్లర్ రిజిస్ట్రేషన్‌ను అమెజాన్ అనుమతించడం ఇదే తొలిసారి.
తెలుగుతోపాటు బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, మలయాళం, తమిళ్, ఇంగ్లిష్ భాషల్లోనూ విక్రేతలకు ఈ వెసులుబాటు కల్పించింది. అమెజాన్ డాట్ ఇన్ మార్కెట్ ప్లేస్‌పై బిజినెస్ లావాదేవీలు జరిపే వేల మంది పాత విక్రేతలు.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లోని లక్షల మంది విక్రేతలకు లబ్ధి చేకూరనున్నది. అమెజాన్ సెల్లర్ వెబ్సైట్, అమెజాన్ మొబైల్ యాప్‌లో ఈ వెసులుబాటు లభిస్తుంది.
తెలుగులో రిజిస్ట్రేషన్ అనుమతించడం వల్ల ఆర్డర్లను మేనేజ్ చేసుకోవడంతోపాటు నిల్వల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. 2025 నాటికి భారత్‌లోని కోటి ఎంఎస్ఎంఈలను డిజిటలైజ్ చేయాలన్న లక్ష్యం దిశగా ప్రయాణిస్తున్నాం అని అమెజాన్ ఇండియా సెల్లర్ పార్టనర్ సర్వీసెస్ డైరెక్టర్ సుమిత్ సహాయ్ తెలిపారు.
ఈ-కామర్స్ బిజినెస్ విస్తరించాలన్న లక్ష్యంతో ముందుకెళ్లే సెల్లర్లకు ఎదురయ్యే సవాళ్లను ఇది పరిష్కరిస్తుందని సుమిత్ సహాయ్ పేర్కొన్నారు. భారత్‌లోని ఎంఎస్ఎంఈలకు భాష ప్రధాన అవరోధంగా నిలిచిందన్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక భాషలో ఖాతా యాజమాన్య సర్వీసులను ప్రారంభించడం వల్ల బిజినెస్ చేసుకోవడం తేలికవుతుందని చెప్పారు.
ఫెస్టివ్ సీజన్లో దేశవ్యాప్తంగా ఆన్లైన్లో బిజినెస్‌లు ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో తెలుగుతోపాటు ప్రాంతీయ భాషల్లో విక్రేతల రిజిస్ట్రేషన్ వల్ల ఆన్లైన్లో భారీగా బిజినెస్‌లు ప్రారంభించడానికి వీలవుతుందని సుమిత్ సహాయ్ అన్నారు. తద్వారా దేశవ్యాప్తంగా బిజినెస్ పలు రెట్లు పెరుగుతుందన్నారు.