మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Business - Sep 16, 2020 , 01:27:23

అమెజాన్‌ @తెలంగాణ

అమెజాన్‌ @తెలంగాణ

  • కొనసాగుతున్న ఈ-కామర్స్‌ దిగ్గజం పెట్టుబడులు
  • హైదరాబాద్‌లో మరో రెండు భారీ గిడ్డంగుల ఏర్పాటు
  • 45 లక్షల ఘనపుఅడుగులకు చేరిన నిల్వ సామర్థ్యం
  • 23 వేల వ్యాపారులకు ప్రయోజనం

నమస్తే తెలంగాణ, హైదరాబాద్‌: ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా.. తెలంగాణలో తమ మూలాలను బలోపేతం చేసుకుంటున్నది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో మరో రెండు భారీ గిడ్డంగులను ఏర్పాటు చేసింది. రాబోయే పండుగ సీజన్‌ దృష్ట్యా డిమాండ్‌కు తగ్గ నిల్వలను నిర్వహించాలన్న లక్ష్యంలో భాగంగానే ఈ కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లను అమెజాన్‌ అందుబాటులోకి తెచ్చింది. దీంతో మొత్తం హైదరాబాద్‌లో అమెజాన్‌ గిడ్డంగులు నాలుగుకు చేరగా, వీటి నిల్వ సామర్థ్యం 4.5 మిలియన్‌ క్యూబిక్‌ అడుగులకుపైనే. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఆన్‌లైన్‌ వ్యాపారం చేస్తున్నా.. హైదరాబాద్‌లోనే అతిపెద్ద ఆఫీస్‌ను అమెజాన్‌ ఏర్పాటు చేసింది. అలాగే భారత్‌లో ఇక్కడి నుంచే తమ వ్యాపార కార్యకలాపాలను ప్రధానంగా నిర్వహించాలని భావిస్తున్నది. కాగా, ఇటీవలే దేశంలో 10 కొత్త గిడ్డంగులను ఏర్పాటు చేస్తామని, దేశవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న ఏడింటిని విస్తరిస్తామని అమెజాన్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఇదివరకే ఉన్న గిడ్డింగి సామర్థ్యాన్ని లక్ష చదరపు అడుగులకుపైగా పెంచింది. దీనివల్ల తెలంగాణలో 23వేల వ్యాపారులకు ప్రయోజనం చేకూరినైట్లెంది.

ఇక వేగంగా డెలివరీ

హైదరాబాద్‌లో అమెజాన్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్ల విస్తరణ.. డెలివరీ వేగాన్ని పెంచనున్నది. పొరుగు రాష్ర్టాల్లోని కస్టమర్ల ఆర్డర్లనూ ఇక త్వరగా అందించే వీలు ఏర్పడింది. పండుగ సీజన్‌లో ఇది అటు వ్యాపారులకు, ఇటు కొనుగోలుదారులకూ లాభించనున్నది. కాగా, రాష్ట్రంలోని ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లు ఎయిర్‌ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లు, టెలివిజన్లు తదితర ఉత్పత్తుల నిల్వకు ప్రత్యేకం. 

‘తెలంగాణలో అమెజాన్‌ ఇండి యా పెట్టుబడులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో వ్యాపార అవకాశాలు, పారిశ్రామిక అనుకూల విధానాలు, విస్తృత శ్రేణి మౌలిక సదుపాయాలకు ఇది నిదర్శనం. అమెజాన్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్ల విస్తరణ, కొత్త గిడ్డంగుల ఏర్పాటు చిన్న, మధ్యతరహా వ్యాపారులకు ఎంతో లాభం. అలాగే స్థానిక యువ, ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలూ లభిస్తాయి’ --జయేశ్‌ రంజన్‌, రాష్ట్ర  ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శిlogo