ఆదివారం 09 ఆగస్టు 2020
Business - Jul 21, 2020 , 02:19:33

ఎంఎస్‌ఎంఈలకు అమెజాన్‌ చేయూత

ఎంఎస్‌ఎంఈలకు అమెజాన్‌ చేయూత

  • జీఎస్పీ ద్వారా రూ.14,954 కోట్లు దాటిన ఎగుమతులు

న్యూఢిల్లీ, జూలై 20: ఆన్‌లైన్‌ వ్యాపార దిగ్గజం అమెజాన్‌ ఆధ్వర్యంలోని గ్లోబల్‌ సెల్లింగ్‌ ప్రోగ్రామ్‌ (జీఎస్పీ)లో భాగస్వాములుగా ఉన్న దేశీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లు, బ్రాండ్ల మొత్తం ఎగుమతులు 200 కోట్ల డాలర్లు (రూ.14,954 కోట్లు) దాటాయి. అమెజాన్‌ ఇండియా సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్‌కు చెందిన 15 వెబ్‌సైట్ల ద్వారా విదేశాలకు ఎగుమతులు జరిపేలా భారత కంపెనీలకు వీలుకల్పించేందుకు 2015లో అమెజాన్‌ జీఎస్పీని ప్రారంభించింది. తొలుత కేవలం కొన్ని వందలమంది వ్యాపారులతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పుడు 60 వేల మందికిపైగా ఎగుమతిదారులు భాగస్వాములుగా ఉన్నారు. జీఎస్పీ ద్వారా 2025 నాటికి 10 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు అమెజాన్‌ ఈ ఏడాది ఆరంభంలో ప్రకటించింది. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా నిలిచిన ఎంఎస్‌ఎంఈలను డిజిటైజ్‌ చేయడం ద్వారా ఎగుమతులకు ఊతమివ్వడంతోపాటు భారీస్థాయిలో ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు తమ కంపెనీ కృషి చేస్తున్నట్టు అమెజాన్‌ ఇండియా అధిపతి అమిత్‌ అగర్వాల్‌ తెలిపారు. జీఎస్పీ ద్వారా తొలి మూడేండ్లలో 100 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులు జరిపిన భారత ఎంఎస్‌ఎంఈలు.. ఆ తర్వాత కేవలం 18 నెలల్లోనే మరో 100 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులు జరిపాయని ఆయన వివరించారు.


logo