బుధవారం 03 మార్చి 2021
Business - Dec 22, 2020 , 00:40:26

జీఎమ్మార్‌-మెగావైడ్‌పై దర్యాప్తు

జీఎమ్మార్‌-మెగావైడ్‌పై దర్యాప్తు

  • ఫిలిప్పీన్స్‌లో యాంటీ-డమ్మీ చట్టాల ఉల్లంఘన ఆరోపణలు

హైదరాబాద్‌: జీఎమ్మార్‌-మెగావైడ్‌ సెబు ఎయిర్‌పోర్ట్‌ కార్ప్‌ (జీఎంసీఏసీ)పై ఫిలిప్పీన్స్‌ ఎన్‌బీఐ విచారణ చేపడుతున్నది. ఫిలిప్పీన్స్‌లోని మాక్టన్‌-సెబు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ (ఎంసీఐఏఏ) అధికారులు, జీఎంసీఏసీలపై యాంటీ డమ్మీ చట్టాల ఉల్లంఘన దర్యాప్తునకు అక్కడి నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎన్‌బీఐ) దిగింది. ఇప్పటికే న్యాయ శాఖ ముందు తమ యాంటీ-ఫ్రాడ్‌ డివిజన్‌ అభియోగాలను దాఖలు పర్చినట్లు ఫిర్యాదు అనంతరం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఎన్‌బీఐ తెలియజేసింది. ఎంసీఐఏఏ ఉన్నతస్థాయి అధికారితోపాటు మరో 11 మందిపై యాంటీ-డమ్మీ లా ఉల్లంఘన ఆరోపణలు వచ్చాయని, వీరిలో జీఎమ్మార్‌ గ్రూప్‌ కూడా ఉందని ఎన్‌బీఐ వెల్లడించింది.

ఏ తప్పూ చేయలేదు

మరోవైపు ఈ ఆరోపణలు అవాస్తవమని జీఎమ్మార్‌ అధికార ప్రతినిధి తెలిపారు. నిజానిజాలు త్వరలోనే తెలుస్తాయని పీటీఐకి ఈ-మెయిల్‌ ద్వారా స్పష్టం చేశారు. 2016లోనే మేము ఏ తప్పూ చేయలేదని, నిబంధనల ప్రకారమే ఎయిర్‌పోర్ట్‌ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నామని ఫిలిప్పీన్స్‌ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు. 2014లో జీఎమ్మార్‌ కన్సార్టియం, మెగావైడ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌లు ఎయిర్‌పోర్టు కాంట్రాక్టును గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే జీఎమ్మార్‌ ఇన్‌ఫ్రాకు ప్రతిపాదిత సంస్థ పునర్నిర్మాణ ప్రణాళికకు సంబంధించి దేశీయ స్టాక్‌ మార్కెట్ల నుంచి అనుమతి లభించింది. తమ నాన్‌-ఎయిర్‌పోర్ట్‌ వర్టికల్‌ బిజినెస్‌ను వేరుగా చేసేందుకు సంస్థ ప్రయత్నిస్తున్నది.

VIDEOS

logo