ఆకాష్ ఎగుమతులకు ఓకే

కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్‌కూ అనుమతి
ఇథనాల్ డిస్టిలరీలకు తక్కువ వడ్డీతో రుణాలు
పారదీప్ పోర్టుకు రూ.3 వేల కోట్ల ప్రాజెక్టు
కేంద్ర క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 30: దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. భారత అమ్ములపొదిలోని కీలక అస్ర్తాల్లో ఒకటైన ఆకాష్ క్షిపణి వ్యవస్థలను ఇకపై విదేశాలకూ ఎగుమతి చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. అంతేకాకుండా ఈ క్షిపణుల కొనుగోలుకు విదేశాల నుంచి వచ్చే దరఖాస్తులను పరిశీలించి త్వరగా అనుమతులిచ్చేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆకాష్ క్షిపణి వ్యవస్థల తయారీకి ఉపయోగించిన పరికరాల్లో 96 శాతానికిపైగా పరికరాలు దేశీయంగా తయారైనవే కావడం విశేషం. 25 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను సునాయాసంగా ఛేదించగలిగే ఆకాష్ క్షిపణులను ఇప్పటికే భారత సాయుధ బలగాల్లో మోహరించారు. విదేశాలకు ఎగుమతిచేసే ఆకాష్ క్షిపణులు ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న వెర్షన్‌కు భిన్నంగా ఉంటాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
మూడు పారిశ్రామిక కారిడార్లు
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం, కర్ణాటకలోని తుముకూరులో పారిశ్రామిక కారిడార్లతోపాటు గ్రేటర్ నోయిడా (ఉత్తరప్రదేశ్)లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్ ఏర్పాటుకు కూడా క్యాబినెట్ అనుమతి తెలిపింది. ఈ మూడు పారిశ్రామిక కారిడార్లను రూ.7,725 కోట్లతో నిర్మంచనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఢిల్లీలో విలేకర్లకు వెల్లడించారు. వీటి ద్వారా దాదాపు 2.8 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేసినట్లు చెప్పారు. కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ ప్రతిపాదిత వ్యయం రూ.2,139 కోట్లని, ఈ కారిడార్ ఏర్పాటుతో భారీ స్థాయిలో ఉపాధి అవకాశాల కల్పనతోపాటు తయారీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలవుతుందన్నారు. అంతేకాకుండా లాజిస్టిక్స్ ఖర్చు తగ్గింపుతోపాటు నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరిచే అవకాశం ఉంటుందన్నారు.
ఇతర నిర్ణయాలు
ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తున్న డిస్టిలరీలకు తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలిప్పించే రూ.4,573 కోట్ల పథకానికి కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. దేశంలో ఇథనాల్ ఉత్పతిని పెంచడంతోపాటు చమురు దిగుమతులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. అలాగే పారదీప్ ఓడరేవులో డాక్‌ను ఏర్పాటుచేసి ఆ పోర్టును ప్రపంచ శ్రేణి ఓడరేవుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన రూ.3 వేల కోట్ల ప్రాజెక్టుతోపాటు ఎస్తోనియా, పరాగ్వే, డొమెనికన్ రిపబ్లిక్ దేశాల్లో భారత దౌత్య కార్యాలయాల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
తాజావార్తలు
- బీజేపీలో చేరి ‘రియల్ కోబ్రా’ను అంటున్న మిథున్ దా
- రసవత్తరంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
- ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 9న తొలి మ్యాచ్
- ఐటీ సోదాలు.. బయటపడిన వెయ్యి కోట్ల అక్రమాస్తులు!
- సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం
- వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించండి : మంత్రి కేటీఆర్
- తమిళనాడు, కేరళలో అమిత్‌షా పర్యటన
- కాసేపట్లో మోదీ ర్యాలీ.. స్టేజ్‌పై మిథున్ చక్రవర్తి
- న్యూయార్క్‌లో రెస్టారెంట్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా
- ఆరు రాష్ట్రాల్లోనే 84.71 శాతం కొత్త కేసులు: కేంద్రం