సోమవారం 06 ఏప్రిల్ 2020
Business - Feb 04, 2020 , 23:58:31

నష్టాల్లోకి ఎయిర్‌టెల్‌ క్యూ3లో రూ.1,035 కోట్ల నష్టం

నష్టాల్లోకి ఎయిర్‌టెల్‌ క్యూ3లో రూ.1,035 కోట్ల నష్టం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్‌ నష్టాల పరంపర కొనసాగుతున్నది. డిసెంబర్‌ 31తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,035 కోట్ల నష్టం వచ్చినట్లు ప్రకటించింది. ఏడాది క్రితం ఇది రూ.86 కోట్ల లాభాన్ని గడించింది. గత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 8.5 శాతం ఎగబాకి రూ.21,947 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది.  గతేడాది చివర్లో చార్జీలు పెరుగడం మంచి పరిణామమని, దీంతో టెలికం సంస్థలు ఆర్థికంగా నిలదిక్కుకోవడానికి దోహదం చేయనున్నదని, మరోదఫా ధరలు పెంచాల్సిన అవసరం ఉన్నదని భారతీ ఎయిర్‌టెల్‌ ఇండియా ఎండీ, సీఈవో గోపాల్‌ విఠల్‌ తెలిపారు. టెలికం రంగంలో వస్తున్న టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా నూతన టెక్నాలజీని ఆపాదించుకోవాలంటే మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉన్నదని, దీంతో ధరలు మరోదఫా పెంచకతప్పదని ఆయన సంకేతాలిచ్చారు. 


గత త్రైమాసికంలో భారత్‌లో టెలికం సేవలు అందించడం ద్వారా రూ.15,797 కోట్ల ఆదాయం ఆదాయం సమకూరింది. 2018-19 ఏడాది ఇదే సమయంలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే ఏడు శాతం అధికం. సెప్టెంబర్‌ 30తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ రూ.23,045 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. పాత బకాయిలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలతో సంస్థ ఒకేసారి రూ.28,450 కోట్లను కేంద్రానికి చెల్లించింది. ఇందుకోసం తీసుకున్న రుణాలపై వడ్డీల రూపంలో అధికంగా చెల్లించడంతో లాభాల్లో గండిపడిందని విఠల్‌ చెప్పారు. మొబైల్‌ డాటా వాడకంలో వృద్ధి 73 శాతం నమోదవగా, వీరిలో 4జీ డాటా వినియోగదారులు 60.6 శాతం ఎగిసి 12.38 కోట్లకు చేరుకున్నారు. గత త్రైమాసికంలో కొత్తగా 2.1 కోట్ల మంది 4జీ సబ్‌స్ర్కైబర్లు ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ను ఎంచుకున్నారు. ఒక్కో వినియోగదారుడు నుంచి సరాసరి ఆదాయం రూ.128 నుంచి రూ.135కి పెరిగినట్లు ఆయన చెప్పారు.


పీఎన్‌బీ నష్టం రూ.492 కోట్లు

ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) ఆర్థిక ఫలితాలకు మొండి బకాయిల సెగ గట్టిగానే తగిలింది. ఎన్‌పీఏలను పూడ్చుకోవడానికి అధికంగా నిధులు కేటాయించడంతో గత త్రైమాసికానికిగాను రూ.492. 28 కోట్ల నష్టం సంభవించినట్లు బ్యాంక్‌ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో బ్యాంక్‌ రూ.246.51 కోట్ల లాఠభాన్ని గడించింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలోనూ రూ.507.05 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నది. సమీక్షకాలంలో బ్యాంక్‌ ఆదాయం రూ.14,854.24 కోట్ల నుంచి రూ.15,967.49 కోట్లకు ఎగబాకినట్లు వెల్లడించింది. సమీక్షకాలంలో మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్‌ రూ. 4,445.36 కోట్ల నిధులను వెచ్చించింది. 2018-19 ఏడాది ఇదే సమయంలో కేటాయించిన రూ.2,565.77 కోట్లతో పోలిస్తే ఇంచుమించు రెండు రెట్ల వరకు పెరుగడం వల్లనే లాభాల్లో గండిపడిందని బ్యాంక్‌ వర్గాల వెల్లడించాయి. సమీకృత విషయానికి వస్తే రూ. 16,211. 24 కోట్ల ఆదాయంపై రూ.501.93 కోట్ల నష్టం వచ్చింది. ఐదు అనుబంధ సంస్థలు కలుపుకొని పీఎన్‌బీ ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. గత త్రైమాసికంలో బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తుల విలువ(ఎన్‌పీఏ) 16.30 శాతానికి తగ్గగా, నికర ఎన్‌పీఏ కూడా 8.22 శాతం నుంచి 7.18 శాతానికి దిగొచ్చాయి. స్థూల నిరర్థక ఆస్తుల విలువ రూ.76,809.20 కోట్లుగా ఉండగా, నికర ఎన్‌పీఏ రూ. 30,518.92 కోట్లుగా ఉన్నాయి. ఢిల్లీ కేంద్రస్థానంగా ఆర్థిక సేవలు అందిస్తున్న బ్యాంక్‌ రూ.11,335.90 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.


logo