బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Jan 20, 2020 , 01:08:13

రూ.179 ప్లాన్‌తో రూ.2 లక్షల బీమా

రూ.179 ప్లాన్‌తో రూ.2 లక్షల బీమా
  • ఎయిర్‌టెల్‌ నుంచి సరికొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌

న్యూఢిల్లీ, జనవరి 19: ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్‌..ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం ప్రత్యేక బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.179తో రీచార్జి చేసుకున్న వారికి రూ.2 లక్షల జీవిత బీమా కవరేజ్‌ కల్పించనున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇందుకోసం భారతీ అక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ నూతన ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌తోపాటు 2 జీబీ డాటా, 300 ఎస్‌ఎంఎస్‌లు, రూ.2 లక్షల బీమా కూడా లభించనున్నదని తెలిపింది.

28 రోజుల కాలపరిమితి కలిగిన ఈ ప్లాన్‌ను మోస్తరు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎంట్రిలెవల్‌ స్మార్ట్‌ఫోన్‌, ఫీచర్‌ ఫోన్‌ యూజర్లను దృష్టిలో పెట్టుకొని ప్రకటించింది. 18 నుంచి 54 ఏండ్ల లోపు వయస్సు కలిగిన వారికి మాత్రమే ఈ బీమా కవరేజ్‌ను కల్పిస్తున్న సంస్థ..ఇందుకోసం ఎలాంటి పేపర్‌వర్క్‌, మెడికల్‌ టెస్ట్‌ అవసరం లేదని పేర్కొంది. ఎయిర్‌టెల్‌ మొబైల్‌ నంబర్‌ రీచార్జి చేసుకున్న వారి కుటుంబానికి భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ బీమా సదుపాయం కల్పించినట్లు భారతీ ఎయిర్‌టెల్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ అధికారి శశ్వంత్‌ శర్మ తెలిపారు. ఇదివరకే ప్రకటించిన బీమా ప్లాన్లకు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభించిందన్నారు.


logo