గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Jan 29, 2021 , 00:44:43

5జీ సేవలకు సిద్ధం

5జీ సేవలకు సిద్ధం

  • హైదరాబాద్‌లో విజయవంతంగా ఎయిర్‌టెల్‌ డెమో
  • దేశంలో తొలిసారి వాణిజ్య నెట్‌వర్క్‌ ద్వారా పరీక్షలు

న్యూఢిల్లీ, జనవరి 28: దేశంలో ఐదో తరం (5జీ) టెలికం సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారతీ ఎయిర్‌టెల్‌ సిద్ధమైంది. అందుకు మన హైదరాబాద్‌లోనే పునాది పడింది. వాణిజ్య నెట్‌వర్క్‌ ద్వారా హైదరాబాద్‌లో 5జీ సర్వీసులను విజయవంతంగా ప్రదర్శించినట్లు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. దీంతో దేశంలో వాణిజ్య నెట్‌వర్క్‌ ద్వారా 5జీ సర్వీసులను ప్రదర్శించిన తొలి టెలికం సంస్థగా ఎయిర్‌టెల్‌ ఆవిర్భవించిందని ఆ కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం 1,800 మెగాహెర్ట్‌ బ్యాండ్‌లో ఉన్న సరళీకృత స్పెక్ట్రమ్‌ను ఉపయోగించుకుని నాన్‌-స్టాండలోన్‌ (ఎన్‌ఎస్‌ఏ) నెట్‌వర్క్‌ టెక్నాలజీ ద్వారా 5జీ సేవలను పరీక్షించినట్లు స్పష్టం చేసింది. 5జీ, 4జీ నెట్‌వర్క్‌లను ఏకకాలంలో నిరంతరాయంగా ఆపరేట్‌ చేసేందుకు తొలిసారి డైనమిక్‌ స్పెక్ట్రమ్‌ షేరింగ్‌ను ఉపయోగించినట్లు తెలిపింది. ఈ పరీక్షల కోసం ఎరిక్సన్‌ సంస్థకు చెందిన 4జీ (డీడీఎస్‌) రేడియో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తోపాటు ఒప్పో రెనో 5ప్రో, ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌2 స్మార్ట్‌ఫోన్లను వినియోగించినట్లు వివరించింది. 

5జీ సేవలకు ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌లోని రేడియో, కోర్‌, ట్రాన్స్‌పోర్ట్‌ విభాగాలన్నీ సన్నద్ధంగా ఉన్నట్లు ఈ పరీక్షల్లో తేలిందని స్పష్టం చేసింది. అయితే తగినంత స్పెక్ట్రమ్‌తోపాటు ప్రభుత్వం నుంచి అనుమతులు లభించిన తర్వాతే ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు పూర్తిస్థాయి 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. టెక్నాలజీ పరంగా ఎయిర్‌టెల్‌కు ఎంతో సత్తా ఉన్నదన్న విషయం ఈ ప్రదర్శనతో మరోసారి రుజువైందని, 5జీ సాంకేతికతను ప్రదర్శించేందుకు అలుపెరుగకుండా కృషిచేసిన ఎయిర్‌టెల్‌ ఇంజినీర్లను చూసి ఎంతో గర్విస్తున్నానని ఆ కంపెనీ ఎండీ, సీఈవో గోపాల్‌ విట్టల్‌ అన్నారు. 5జీ ఆవిష్కరణకు గ్లోబల్‌ హబ్‌గా ఆవిర్భవించగలిగే సామర్థ్యం భారత్‌కు ఉన్నదని, ఇది జరగాలంటే సంబంధిత వ్యవస్థలన్నీ కలసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరమున్నదని ఆయన పేర్కొన్నారు.

గతంలో మనం 2జీ, 3జీ, 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో వెనుకబడ్డాం. కానీ 5జీ సేవల విషయంలో అలా జరగకూడదు. ప్రపంచ దేశాల కంటే మనమే ముందుండాలి. ఈ సేవల్లో మన దేశమే కీలక పాత్ర పోషించాలి. దీని కోర్‌ నెట్‌వర్క్‌ భారత్‌దే అయి ఉండాలి. దేశీయంగా తయారైన టెలికం పరికరాలతో 5జీ టెక్నాలజీ వైపు భారత్‌ వడివడిగా ముందుకు సాగాలి. దేశంలో 5జీ సేవలను పరీక్షించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన అనుమతులను త్వరలోనే మంజూరు చేస్తాం. 

- రవిశంకర్‌ ప్రసాద్‌, టెలికం శాఖ మంత్రి

VIDEOS

logo