ఆదివారం 29 మార్చి 2020
Business - Jan 20, 2020 , 01:10:48

వీఆర్‌ఎస్‌ ప్యాకేజీ మాకూ ఇవ్వండి

వీఆర్‌ఎస్‌ ప్యాకేజీ మాకూ ఇవ్వండి
  • కేంద్రాన్ని కోరుతున్న ఎయిర్‌ ఇండియా సిబ్బంది
  • నేడు కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌తో సమావేశం

ముంబై, జనవరి 19: ప్రభుత్వరంగ టెలికం సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ ఉద్యోగులకు ఇచ్చినట్లే స్వచ్ఛంద పదవీ విరమణ పథకం(వీఆర్‌ఎస్‌) మాకు ఇవ్వాలని ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా వాణిజ్య సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన సోమవారం పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌తో ప్రత్యేకంగా సమావేశంకాబోతున్నారు. అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న సంస్థను ప్రైవేట్‌పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మంత్రితో సమావేశం కావడం ఇది రెండోసారి కానున్నది.

ఈ సమావేశానికి 12 ఎయిర్‌ ఇండియా ఉద్యోగ సంఘాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరుకాబోతున్నారు. నష్టాల్లో కొనసాగుతున్న ఎయిర్‌ ఇండియాను పూర్తిగా వదిలించుకోవాలని చూస్తున్న కేంద్రానికి దీనిని కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకురావడం లేదు. ఈ నెల 2న జరిగిన సమావేశంలో ఎయిర్‌ ఇండియాను ప్రైవేట్‌ పరం చేయడం తథ్యమని, ఇందుకు ఉద్యోగులు సహాయ సహకారాలు అందించాలని సూచించిన విషయం తెలిసిందే. ఎయిర్‌ ఇండియాను ప్రైవేట్‌పరం చేయాలని చూస్తే తమ ఉద్యోగానికి ముందుగా భద్రత కల్పించాలని, వీఆర్‌ఎస్‌ గురించి కూడా చర్చించినట్లు, సరైన ప్యాకేజీ ఇస్తే దీనికి అంగీకరిస్తామని ఎయిర్‌లైన్స్‌ వర్గాలు వెల్లడించాయి. ఉద్యోగ సంఘాల డిమాండ్లను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇదివరకే కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎయిర్‌ ఇండియాలో 11 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ రూ.8,556 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. రోజుకు రూ.20-26 కోట్ల మేర నష్టపోతున్న సంస్థకు రూ.80 వేల కోట్ల అప్పు ఉన్నది.
logo