శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Jan 28, 2020 , 00:27:05

అమ్మేద్దాం..బాస్‌

అమ్మేద్దాం..బాస్‌

అప్పులతో సతమతమవుతున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా ప్రైవేట్‌ సంస్థల చేతుల్లోకి వెళ్లడానికి లైన్‌ క్లియర్‌ అయింది. సంస్థలో 100 శాతం వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

  • ఎయిర్‌ ఇండియాలో 100 శాతం వాటా విక్రయం
  • అనుమతినిచ్చిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, జనవరి 27:అప్పులతో సతమతమవుతున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా ప్రైవేట్‌ సంస్థల చేతుల్లోకి వెళ్లడానికి లైన్‌ క్లియర్‌ అయింది. సంస్థలో 100 శాతం వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వ్యూహాత్మక వాటా విక్రయంలో భాగంగా మార్చి 17 లోగా ఇందుకు సంబంధించి బిడ్డింగ్‌లు దాఖలు చేయాలని సూచించింది.  దేశీయ, అంతర్జాతీయ విమానయాన సేవలను అందించే ఎయిర్‌ ఇండియాలో అధిక భాగాన్ని సింగిల్‌ బిడ్‌లోనే విక్రయించాలని 2018లోనే చేసిన ప్రయత్నం విఫలం కావడంతో మరోదఫా ప్రయత్నించడానికి సిద్ధమైంది కేంద్రం. 


ఎయిర్‌ ఇండియాతోపాటు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఏఐఎస్‌ఏటీఎస్‌లో తనకున్న 50 శాతం వాటాను సైతం అమ్మకానికి పెట్టింది కేంద్రం. ఏఐఎస్‌ఏటీఎస్‌ గ్రౌండ్‌ హ్యాండ్లిం గ్‌ సేవలు అందిస్తున్నది. ఎయిర్‌ ఇండియా కు చెందిన అనుబంధ సంస్థలైన ఎయిర్‌ ఇండియా ఇంజినీరింగ్‌ సర్వీసులు, ఎయిర్‌ ఇండియా ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసులు, ఎయిర్‌లైన్‌ అలైయిడ్‌ సర్వీసులు, హోటల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలు సైతం కూడా ఉన్నాయి.  అయితే కొనుగోలుదారులు సంస్థ ఆస్తులతోపాటు సుమారు రూ. 23,286 కోట్ల రుణాలను కూడా స్వీకరించాల్సి ఉంటుందని తన ప్రకటనలో కేంద్రం పేర్కొంది. 20 వేలకు పైగా ఉద్యోగులు కలిగిన ఎయిర్‌ ఇండియా..విమానయాన రం గంలో 18.6 శాతం వాటా కలిగివున్నది. 


ఉద్యోగులకు స్టాక్‌ ఆఫ్షన్‌

కంపెనీలో పనిచేస్తున్న 20 వేల మందికి స్టాక్‌ ఆఫ్షన్‌ సదుపాయం కూడా కల్పించింది యాజమాన్యం. అలాగే మొత్తం షేర్లలో మూడు శాతం వాటాను వీరికోసం కేటాయించింది. అంటే నికరంగా 98 కోట్ల షేర్లు కేటాయించనున్నది. నవంబర్‌ 1, 2019 నాటికి ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో 17,984 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 9,617 మంది శాశ్వత ఉద్యోగులు.  ఈ సందర్భంగా కంపెనీ సీఎండీ అశ్వానీ లోహానీ మాట్లాడుతూ..సంస్థలో ఉన్న అదనపు సిబ్బంది, రిటైరింగ్‌ ఉద్యోగులకు మెడికల్‌ బెనిఫిట్స్‌ కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎయిర్‌ ఇండియా వాటా విక్రయంపై దీపం కార్యదర్శి తుహిన్‌ కంట పాండే మాట్లాడుతూ..ఇది చాలా కీలక నిర్ణయమని, ఇందుకు సంబంధించి ఈవై లావాదేవీలకు సంబంధించి సలహాలు ఇస్తున్నదన్నారు. 2018లో ఎయిర్‌ ఇండియాలో 76 శాతం వాటాను విక్రయించాలనుకున్న కేంద్రం..ప్రస్తుతం దీనిని పూర్తిగా వదిలించుకోవాలని చూస్తున్నది.


బోలేడన్ని ఆస్తులు: హర్దీప్‌ సింగ్‌

ఎయిర్‌ ఇండియాతోపాటు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ల వద్ద బోలేడన్ని ఆస్తులు ఉన్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి తెలిపారు. ఎయిర్‌ ఇండియా కోసం నిర్వహించనున్న బిడ్డింగ్‌లో గెలుపొందిన వారు ఇదే బ్రాండ్‌ను కొనసాగించాల్సి ఉంటుందని ఆయన సూచించారు. మార్చి 31 నాటికి కంపెనీకి రూ.60 వేల కోట్ల అప్పు ఉన్నది.


logo