బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Jan 08, 2020 , 12:03:01

అమ్మకానికి ఎయిర్‌ ఇండియా!

అమ్మకానికి ఎయిర్‌ ఇండియా!

న్యూఢిల్లీ, జనవరి 7: అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియాలో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ముసాయిదాను సిద్ధం చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేతృత్వంలోని సాధికారిక మంత్రుల బృందం సమావేశమై వాటాల అమ్మకానికి సంబంధించి బిడ్లను ఆహ్వానించేందుకు ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఎయిర్‌ ఇండియాకు ఉన్న రూ.60 వేల కోట్ల విలువైన అప్పులను స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(ఎస్‌పీవో) కింద బదిలీ చేయడానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వీటిలో రూ.29,400 కోట్లను ఇదివరకే బదిలీ చేసింది కూడా. దీర్ఘకాలికంగా నష్టాల్లో నడుస్తున్న ఎయిర్‌ ఇండియాను ఆదుకోవడానికి కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు వాటాల విక్రయానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి షాతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌, పౌరవిమానయాన మంత్రి హర్దీప్‌ సింగ్‌, విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ ఖరోలా తదితరులు హాజరయ్యారు. ఎయిర్‌ ఇండియాలో పూర్తిస్థాయి వాటాను విక్రయించనున్నట్లు హర్దీప్‌సింగ్‌ పూరి ఇటీవల వ్యాఖ్యానించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎయిర్‌ ఇండియాకు రూ.8,556.35 కోట్ల నష్టం సంభవించింది.

సంస్థను మూసివేయం..

ఎయిర్‌ ఇండియాను మూసివేస్తున్నట్లు వస్తున్న పుకార్లను కొట్టిపారేశారు కంపెనీ ఉన్నతాధికారి. కంపెనీ ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉన్నప్పటికీ, వాటాలను విక్రయించడం లేదా సంస్థ వద్ద ఉన్న ఆస్తులను విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎయిర్‌ ఇండియా డైరెక్టర్‌(కమర్షియల్‌) మీనాక్షి మాలిక్‌ తెలిపారు. ప్రస్తుతం రవాణా మార్కెట్లో ఎయిర్‌ ఇండియాను మూసివేయనున్నట్లు విపరీతంగా పుకార్లు వస్తున్నాయని, ఈ రూమర్లలో ఎలాంటి నిజం లేదని స్పష్టంచేశారు. రోజుకు రూ.27 కోట్ల నష్టం వస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి విమాన సర్వీసును రద్దు చేయలేదని, ప్రయాణికులకు అందిస్తున్న సేవల్లోనూ కోత విధించలేదని చెప్పారు.


logo