శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Business - Dec 24, 2020 , 18:58:50

భగ్గుమన్న పైలట్లు.. కేవలం 5% వేతన పునరుద్ధరణ?

భగ్గుమన్న పైలట్లు.. కేవలం 5% వేతన పునరుద్ధరణ?

న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియా (ఏఐ) యాజమాన్యం తీరుపై పైలట్లు భగ్గుమన్నారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో 55 శాతం కోత విధించి తాజాగా అందులో ఐదు శాతమే తగ్గించడాన్ని తిరస్కరించారు. ఇది పూర్తిగా తమను అవమాన పర్చడమేనని పేర్కొన్నారు. దేశీయంగా విమానయాన సర్వీసులను పునరుద్ధరించినందున వేతనాల్లో విధించిన కోతలు గణనీయ స్థాయిలో తగ్గించకపోతే ఇండస్ట్రియల్‌ యాక్షన్‌కు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం పునరుద్ధరించిన ఐదు శాతం వేతనాల మొత్తం.. కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘పీఎంకేర్స్‌’కు గానీ, కొత్తగా నిర్మించ తలపెట్టిన పార్లమెంట్‌ భవనానికి గానీ బదిలీ చేయాలని ఎయిర్‌ ఇండియాను కోరారు. 

‘ఏప్రిల్‌లో ఎయిర్‌ ఇండియా యాజమాన్యం ఏకపక్షంగా 58 శాతం పైలట్ల వేతనాలను తగ్గించారు. కానీ మేం చాలా సహనంతో సజావుగా విమాన సర్వీసుల రాకపోకలకు వెసులుబాటు కలిగించాం’ అని ఎయిర్‌ ఇండియా చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ బన్సాల్‌కు ఇండియన్‌ కమర్షియల్‌ పైలట్స్‌ అసోసియేషన్‌ (ఐసీపీఏ) గురువారం లేఖ రాసింది. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లను అవమానించారని పేర్కొంది. 

వందే భారత్‌ మిషన్‌ విమాన సర్వీసులు నడిపిన 171 మంది పైలట్లకు కరోనా వచ్చిందని, కరోనా నెగెటివ్‌ వచ్చిన తర్వాత వారు విధుల నిర్వహణకు సిద్ధం అయ్యారు. ఎయిర్‌ ట్రాఫిక్‌ పునరుద్ధరించిన తర్వాత వేతనాల్లో విధించిన కోతను గణనీయంగా తగ్గిస్తామని ఎయిర్‌ ఇండియా యాజమాన్యం హామీ ఇచ్చిందని ఆ లేఖలో గుర్తు చేశారు. 

కానీ కేవలం ఐదు శాతం మాత్రమే వేతన కోత తగ్గించడం తమ హక్కులను అవమానించడమేనని పైలట్ల అసోసియేషన్‌ స్పష్టం చేసింది. పార్లమెంట్‌ సభ్యులకు కేవలం స్థూల వేతన, అలవెన్సులపై 30 శాతం మాత్రమే తగ్గించారని గుర్తు చేసింది. గణనీయ స్థాయిలో సమయానుకూలంగా వేతనాల్లో కోత తగ్గించకపోతే తాము న్యాయం కోసం పోరాడుతామని పైలట్ల సంఘం పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo