సోమవారం 06 ఏప్రిల్ 2020
Business - Feb 28, 2020 , 00:30:15

ఒక్క జీబీ డేటా రూ.35!

ఒక్క జీబీ డేటా రూ.35!
  • నెలసరి కనీస కనెక్షన్‌ చార్జీ రూ.50
  • ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయాలి
  • పరిశ్రమ బతకాలన్నా.. ఏజీఆర్‌ బకాయిలు తీరాలన్నా తప్పదు
  • వొడాఫోన్‌ ఐడియా డిమాండ్‌
  • డీవోటీ, ట్రాయ్‌లకు లేఖ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ఒక్క జీబీ (గిగాబైట్‌) మొబైల్‌ డేటా కనీస ధరను రూ.35గా నిర్ణయించాలని వొడాఫోన్‌ ఐడియా డిమాండ్‌ చేసింది. ప్రస్తుత ధరలతో పోల్చితే ఇది దాదాపు 7-8 రెట్లు అధికం కావడం గమనార్హం. ఒక జీబీ డేటా రూ.4-5కే లభిస్తున్నదిప్పుడు. అలాగే నెలసరి కనీస కనెక్షన్‌ చార్జీని రూ.50, ఔట్‌గోయింగ్‌ కాల్స్‌పై నిమిషానికి 6 పైసలు వసూలు చేయాలన్నది. టెలికం శాఖ (డీవోటీ), టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌కు రాసిన ఓ లేఖలో ఈ మేరకు వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ ప్రతిపాదించింది. నిజానికి కాల్స్‌, ఇంటర్నెట్‌ ధరలు 50 శాతం వరకు పెరిగి మూడు నెలలైనా కావడం లేదు. కాగా, మొబైల్‌ డేటా, కాల్స్‌ ధరలు పెరిగితేనే టెలికం పరిశ్రమ బాగుంటుందన్న వొడాఫోన్‌ ఐడియా.. అప్పుడే తాము ఏజీఆర్‌ బకాయిలనూ చెల్లించగలుగుతామని స్పష్టం చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి ధరలను పెంచాలని సూచించింది. పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన వొడాఫోన్‌ ఐడియా.. సుప్రీం కోర్టు ఆదేశంతో టెలికం శాఖకు రూ.53,038 కోట్ల ఏజీఆర్‌ బకాయిలను చెల్లించాల్సి వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటిదాకా కేవలం రూ.3,500 కోట్లనే ఇచ్చిన సంస్థ.. మిగతా నిధుల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న సంగతీ విదితమే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ సాయం లేకపోతే బాకీలను కట్టలేమన్న సంకేతాలను ఇస్తున్నది.


మావల్ల కాదు.. 18 ఏండ్ల సమయమివ్వండి

ఏజీఆర్‌ బకాయిలను ఇప్పట్లో తీర్చలేమని, బాకీలు చెల్లించడానికి 18 ఏండ్ల సమయం కావాలని వొడాఫోన్‌ ఐడియా ఈ సందర్భంగా కోరింది. వడ్డీ, జరిమానాలపై మూడేండ్ల మారటోరియంనూ డిమాండ్‌ చేసినట్లు పీటీఐకి సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. రూ.8 వేల కోట్ల జీఎస్టీ బకాయిలు ఇవ్వాలని కేంద్రా న్ని సంస్థ కోరిందని, వడ్డీరేటును 6 శాతంగానే నిర్ణయించాలని డిమాండ్‌ చేసిందని చెప్పారు. లైసెన్స్‌ ఫీజును భారీగా తగ్గించాలనీ, కాల్స్‌, డేటీ కనీస ధరలను పెంచాలన్నట్లు వివరించారు. తమకు 30 కోట్ల కస్టమర్లున్నారని, సంస్థ లో 10 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, సంస్థను బతికించే నిర్ణయాన్ని తీసుకోవాలని విన్నవించినట్లు సదరు అధికారి వెల్లడించారు. మరోవైపు దీనిపై స్పందించేందుకు వొడాఫోన్‌ ఐడియా అధికార ప్రతినిధి నిరాకరించారు. ఇదిలావుంటే వొడాఫోన్‌ ఐడియా ప్రతిపాదనలకు భారతీయ సెల్యులార్‌ ఆపరేటర్ల సంఘం మద్దతు తెలిపింది. టెలికం పరిశ్రమను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌  సమావేశమవుతున్నట్లు సమాచారం.


భారతీయుల డేటా వినియోగం

2019లో దేశీయంగా ఒక్కో మొబైల్‌ వినియోగదారుడి సగటు డేటా వాడకం నెలకు 47 శాతం పెరిగి 11 జీబీకిపైగా నమోదైంది

దేశవ్యాప్తంగా డేటా వినియోగంలో96 శాతం 4జీ డేటానే

మునుపెన్నడూ లేనివిధంగా 30 శాతానికి పరిమితమైన 3జీ డేటా

బ్రాడ్‌బాండ్‌ వ్యాప్తి 47 శాతం

డేటా ధరలు: ఒక్క జీబీకి దాదాపు రూ.7 (ప్రపంచంలోనే అతి తక్కువ)

4జీ డేటా వినియోగదారులు 59.8 కోట్లు (అంచనా)

4జీ స్మార్ట్‌ఫోన్లు 2019లో 50.1 కోట్లు

2018లో 33 కోట్లు

వీవోఎల్‌టీఈ ఆధారిత స్మార్ట్‌ఫోన్లు 43.2 కోట్లుlogo