శనివారం 30 మే 2020
Business - May 12, 2020 , 00:05:26

మళ్లీ పెట్రో మంట

మళ్లీ పెట్రో మంట

  • త్వరలో ధరల రోజువారీ సవరణ 

న్యూఢిల్లీ, మే 11: దేశంలోని చాలా రాష్ర్టాల్లో ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) పెరిగినప్పటికీ మార్చి 16 నుంచి వాటి సాధారణ ధర (బేస్‌ ప్రైస్‌)లో ఎలాంటి మార్పు జరుగలేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పతనమవడం, దేశంలో ఇంధన డిమాండ్‌ తగ్గడంతో చమురు మార్కెటింగ్‌ సంస్థలు ఇంధన ధరలను రోజువారీగా సవరించడాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టాయి. అయితే కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను కొంతమేరకు సడలించడం, దేశంలో ఇంధనానికి డిమాండ్‌ మళ్లీ క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్‌ సంస్థ (ఓఎంసీ)లు మరికొద్ది రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల రోజువారీ సవరణను పునఃప్రారంభించనున్నట్టు సమాచారం. ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేయగానే లేదా మరిన్ని వెసులుబాట్లు ప్రకటించగానే ఈ ప్రక్రియ మొదలవుతుందని తెలుస్తున్నది. 

అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఈ ప్రక్రియ మొదలైతే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ రోజువారీగా పెరుగుతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు గత నెలరోజుల్లో 50 శాతానికిపైగా పెరిగి ప్రస్తుతం బ్యారెల్‌ ధర దాదాపు 30 డాలర్లకు చేరుకున్నది. అయినప్పటికీ ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే ముడి చమురు ధరలు దాదాపు 50 నుంచి 60 శాతం మేరకు క్షీణించాయి. ఈ నేపథ్యంలో రోజువారీ సవరణ ప్రక్రియ పునఃప్రారంభమైన తర్వాత కొంత కాలంపాటు (ధరకు, అమ్మకానికి మధ్య ఉన్న లోటును చమురు మార్కెటింగ్‌ సంస్థలు తొలిగించగలిగే వరకు) పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఓ స్థాయిని మించి పెంచేందుకు ప్రభుత్వం అనుమతించకపోవచ్చు. అంటే పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల రోజుకు 30 నుంచి 50 పైసలు లేదా అంతకంటే తక్కువగానే ఉంటుంది. 


logo