ఆదివారం 31 మే 2020
Business - Apr 28, 2020 , 00:48:49

పది లక్షల మంది ఇంటి నుంచే..

పది లక్షల మంది ఇంటి నుంచే..

  • లాక్‌డౌన్‌ తర్వాత కూడా పనిచేసే అవకాశం
  • ఐటీ ఇండస్ట్రీ వెటరన్‌ క్రిస్‌ గోపాలకృష్ణన్‌

బెంగళూరు, ఏప్రిల్‌ 27: లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగుల్లో పది లక్షల మంది ఇంటినుంచే పనిచేసే అవకాశాలున్నాయని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్‌ గోపాలకృష్ణన్‌ అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టి సానుకూల పరిస్థితులు నెలకొన్న తర్వాత ఐటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు ప్రాధాన్యతనిచ్చే అవకాశాలున్నాయని, ఇంటినుంచి పనిచేయడానికి అలవాటు పడిన వారు కార్యాలయాలకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చని చెప్పారు. ఇప్పటికే చాలా మంది ఇంటినుంచి పనిచేయడానికి టెక్నాలజీ పరంగా ఎన్నో చర్యలు తీసుకున్నారని, కానీ  క్లయింట్ల అనుమతితో బిజినెస్‌ ప్రాసెసింగ్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నవారిలో 90 నుంచి 95 శాతం వరకు ఉద్యోగులు ఇంటినుంచి పనిచేస్తున్నారని, పని కూడా వేగవంతంగా పూర్తవుతుండటంతో భవిష్యత్తులో కూడా ఇదే తీరును కొనసాగించే అవకాశాలున్నాయన్నారు. 

స్టార్టప్‌లకు భారీ ప్రయోజనం

ఇంటి నుంచి పనిచేయనుండటంతో చిన్న స్థాయి స్టార్టప్‌లకు భారీ ప్రయోజనం చేకూరనున్నది. ఆఫీస్‌ ఉండాల్సిన అవసరం లేకపోవడంతో నిర్వహణ ఖర్చులు తగ్గి ఆర్థిక ప్రయోజనం కూడా చేకూరనున్నదన్నారు. సానుకూల పరిస్థితులు నెలకొన్నతర్వాత సంస్థలు ఆఫీస్‌ స్థలాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారని, దీంతో ఖర్చులు తగ్గనుండటం ఆయా సంస్థలకు ఆర్థికంగా లాభం చేకూరనున్నదని ఆయన చెప్పారు. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కూడా 20 నుంచి 30 శాతంవరకు ఉద్యోగులు ఇంటినుంచే పనిచేయడానికి మొగ్గుచూపుతారనే విషయంపై ఆయన గట్టి నమ్మకాన్ని వ్యక్తంచేశారు.  

జీతాల్లో కోత తప్పదు..

కరోనా వైరస్‌తో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఐటీ రంగ సంస్థలు భవిష్యత్తులో ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టే అవకాశాలు మెండుగావున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ, ఇదే సమయంలో ఉద్యోగుల తొలగింపు భారీ స్థాయిలో ఉండకపోవచ్చునని, ప్రస్తుతం ఉన్న సిబ్బందితోనే భవిష్యత్తులోనూ రన్‌ చేయవచ్చునని, నియామకాలు చేపట్టే అవకాశాలు లేవని ఆయన స్పష్టంచేశారు. 


logo