బుధవారం 03 జూన్ 2020
Business - Apr 12, 2020 , 10:08:01

6-10 లక్షల కోట్ల ప్యాకేజీ?

6-10 లక్షల కోట్ల ప్యాకేజీ?

  • ఈ ఆర్థిక సంవత్సరం కోసం అదనపు ఉద్దీపనలు అవసరం: మెకిన్సే 

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11: కరోనా వైరస్‌ దెబ్బకు కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకునేందుకు రూ.6 నుంచి 10 లక్షల కోట్ల స్థాయిలో అదనపు ఉద్దీపన ప్యాకేజీ అవసరమని గ్లోబల్‌ కన్సల్టింగ్‌ సంస్థ మెకిన్సే అభిప్రాయపడింది. ఈ మహమ్మారి అంతం కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ సుస్థిరత కోసం కనీసం రూ.6 లక్షల కోట్ల నుంచి 10 లక్షల కోట్ల అదనపు ఉద్దీపనల అవసరం ఉందని తాజా అధ్యయనంలో పేర్కొన్నది. కరోనా వైరస్‌ ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి దారి తీసిన నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల అంచనా, సమస్యల పరిష్కారంపై వివిధ రంగాల్లోని 100 సంస్థల విధానకర్తలు, మార్కెటింగ్‌ నిపుణులు, సీనియర్‌ ఆర్థికవేత్తల నుంచి అభిప్రాయాలను సేకరించింది. వీటి ఆధారంగా భారత ఆర్థిక వ్యవస్థ పురోగతికి మరిన్ని ఉద్దీపనలు అవసరమని మెకిన్సే పేర్కొన్నది. దేశంపై మూడు రకాల ప్రభావం ఉందని చెప్పింది. 

ఎంఎస్‌ఎంఈలకు గండమే

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఏర్పడిన విపత్కర ఆర్థిక పరిస్థితులు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ)కు గండంగా పరిణమించాయని మెకిన్సే సర్వేలో చాలామంది అభిప్రాయపడ్డారు. బ్యాంకింగ్‌ రంగంలో మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) పెరుగవచ్చన్న మెకిన్సే.. ఈ నెల 15కు లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే దేశ వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) 1 నుంచి 2 శాతంగా నమోదు కావచ్చని, మే ప్రథమార్ధం వరకు ఉంటే -2 నుంచి -3 శాతానికి పతనం కావచ్చన్నది. దేశంలో ఎక్కువగా రోజు కూలీలు ఉన్నారని, వీరి భవితవ్యం అంధకారం కానుందన్న మెకిన్సే.. కొనుగోళ్ల సామర్థ్యం పెంచేలా భారీగా అన్ని రంగాలకు ఉద్దీపనల్ని ప్రకటిస్తే పరిస్థితులు మెరుగుపడవచ్చని చెప్పింది. విమానయాన రంగం తీవ్రంగా నష్టపోయిందని, ఐటీ అనుబంధ సేవలు, ఫార్మా, నిర్మాణ, బ్యాంకింగ్‌ రంగాలకూ ఇబ్బందేనన్నది.


logo