గురువారం 13 ఆగస్టు 2020
Business - Jul 15, 2020 , 17:40:30

ADB ఉపాధ్య‌క్షుడిగా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌ అశోక్ లావాసా

ADB ఉపాధ్య‌క్షుడిగా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌ అశోక్ లావాసా

న్యూఢిల్లీ: భార‌త ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా ఏషియన్‌ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB)‌ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితుల‌య్యారు. ఈ మేర‌కు మ‌నీలాలోని ADB ప్ర‌ధాన కార్యాల‌యం నుంచి ఒక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ADB ప‌బ్లిక్‌ ప్రైవేట్ పార్ట్‌న‌ర్‌షిప్స్‌కు, ప్రైవేట్ సెక్టార్ ఆప‌రేష‌న్స్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా అశోక్ లావాసా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. కాగా, త‌న‌ పదవీ కాలం ముగియకముందే ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ నుంచి త‌ప్పుకున్న రెండో ఎన్నిక‌ల‌ కమిషనర్‌‌గా అశోక్ లావాసాను చెప్ప‌వ‌చ్చు.

1973లో చీఫ్​ ఎలక్షన్ కమిషనర్‌‌గా ఉన్న నాగేంద్రసింగ్.. హేగ్‌లోని ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్​ జస్టిస్‌లో జడ్జిగా నియమితులై ఎల‌క్ష‌న్ కమిషనర్‌‌ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఇప్పుడు దాదాపు 47 ఏండ్ల త‌ర్వాత అశోక్ లావాసా సైతం ప‌ద‌వీకాలం ముగియ‌క‌ముందే ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ నుంచి త‌ప్పుకుంటున్నారు.

అశోక్ లావాసా 180 బ్యాచ్‌కు చెంద‌ని హ‌ర్యానా క్యాడ‌ర్ ఐఏఎస్ అధికారి. రిటైర్డ్‌ ఐఏఎస్ అయిన ఆయ‌న 2018 జనవరిలో ఎన్నికల కమిషనర్‌‌గా నియమితులయ్యారు. ఆయ‌న ప‌ద‌వీకాలం ఇంకా రెండేండ్లు మిగిలి ఉండ‌గానే ఎల‌క్ష‌న్ ప్యానెల్ నుంచి త‌ప్పుకోబోతున్నారు. అశోక్ లావాసాకు ప్రైవేట్ సెక్టార్ ఆప‌రేష‌న్స్‌పైనా, ప‌బ్లిక్ ప్రైవేట్ పార్ట్‌న‌ర్‌షిప్స్‌పైనా సుదీర్ఘ అవ‌గాహ‌న ఉండ‌టంతో ఉపాధ్య‌క్షుడి నియ‌మించినట్లు ADB త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.

గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల సంద‌ర్భంగా ఎన్నిక‌ల‌‌ నియమావళిని ఉల్లఘించిన కేసులో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలపట్ల అశోక్‌ లావాసా నిక్కచ్చిగా వ్యవహరించారు. దీంతో ఆయన కుటుంబీకులపై ఐటీ, ఈడీ దాడులు జరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల కమిషనర్‌ పదవి నుంచి తప్పుకోవాలని అశోక్‌ లావాసా నిర్ణయించుకున్నట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo