గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Feb 15, 2021 , 00:54:27

జేబులో లాకర్‌!

జేబులో లాకర్‌!

  • కీలక పత్రాలు.. ఎప్పుడూ మీ వెంటే

కీలకమైన డాక్యుమెంట్లను భౌతిక రూపంలో ఎప్పుడూ వెంట ఉంచుకోవడం ఎవరికైనా కష్టమే. వీటిని ఇంటిలో దాచుకున్నప్పటికీ భద్రంగా ఉంటాయన్న భరోసా ఉండదు. ఇలాంటి సమస్యలకు పరిష్కారమే డిజీలాకర్‌. దీనితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. విలువైన పత్రాలను ఎక్కడి నుంచైనా ఏ సమయంలోనైనా డిజీలాకర్‌లోకి అప్‌లోడ్‌చేసి భద్రంగా దాచుకోవచ్చు. ఈ-డాక్యుమెంట్ల రూపంలో వీటిని ఎప్పుడూ మీ వెంటే ఉంచుకోవచ్చు. ఒరిజినల్స్‌తో సమానంగా ఇవి చెల్లుబాటు అవుతాయి. వీటిని ఎప్పుడు కావలంటే అప్పుడు.. ఎలా కావాలంటే అలా ఉపయోగించుకునేందుకు వీలుంటుంది. 

ముఖ్యమైన డాక్యుమెంట్లను భౌతిక రూపంలో నిరంతరం వెంట ఉంచుకోవాల్సిన అవసరం లేకుండా వాటిని ఈ-డాక్యుమెంట్ల రూపంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వ వ్యవస్థలతో పంచుకునేందుకు వీలుకల్పించేదే డిజీలాకర్‌. దీనినే డిజిటల్‌ లాకర్‌, డిజిటల్‌ డాక్యుమెంట్‌ వ్యాలెట్‌ అని కూడా అంటారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌ కార్డ్‌, ఓటర్‌ ఐడీ, పాలసీ డాక్యుమెంట్ల లాంటి ముఖ్యమైన పత్రాలను డిజీలాకర్‌లోకి అప్‌లోడ్‌చేసి భద్రంగా దాచుకోవచ్చు. దీనికోసం మీకు క్లౌడ్‌ స్టోరేజీలో ప్రత్యేకంగా కొంత స్పేస్‌ను కేటాయిస్తారు. ఇది మీ ఆధార్‌ నంబర్‌తో అనుసంధానమై ఉంటుంది. కీలక డాక్యుమెంట్లను భౌతిక రూపంలో నిరంతరం వెంట ఉంచుకోవాల్సిన అవసరం లేకుండా వాటిని ఈ-డాక్యుమెంట్ల రూపంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వ వ్యవస్థలతో పంచుకునేందుకు వీలవుతుంది. ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ దీన్ని తీసుకొచ్చింది. ఇది డిజిటల్‌ ఇండియా కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.

డీజీతో ప్రయోజనాలు

డిజీలాకర్‌లో ఎవరైనా తమ ముఖ్యమైన పత్రాలను ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా దాచుకోవచ్చు. వీటిని ఇతరులతో సులభంగా పంచుకునేందుకు వీలుంటుంది. ఒరిజినల్స్‌తో సమానంగా ఇవి చెల్లుబాటు అవుతాయి. వర్చువల్‌ పత్రాల వల్ల ఖర్చులు తగ్గడంతోపాటు బీమా సేవలు, క్లెయిముల ప్రాసెసింగ్‌, పరిష్కారం వేగంగా జరుగుతాయి. 

ఖాతా తెరవడం ఇలా..

తొలుత డిజీలాకర్‌ (digilocker.gov.in.) వెబ్‌సైట్‌ను సందర్శించాలి. లేదంటే ప్లే/యాప్‌ స్టోర్‌ నుంచి మీ మొబైల్‌ ఫోన్‌లోకి కూడా డిజీలాకర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీన్ని ఓపెన్‌ చేసి డిజీలాకర్‌ వెబ్‌సైట్‌ను సందర్శించిన తర్వాత డిజిటల్‌ లాకర్‌ ఖాతాను సృష్టించుకునేందుకు ఆధార్‌ నంబర్‌ను ఉపయోగించాలి. మీ ఫోన్‌ నంబర్‌ మీ ఆధార్‌ నంబర్‌తో అనుసంధానమై ఉండాలి. రెండో దశలో ‘సైనప్‌'పై క్లిక్‌చేసి మీ పూర్తి పేరుతోపాటు జన్మదినం, మొబైల్‌ నంబర్‌, సెక్యూరిటీ పిన్‌, ఈ-మెయిల్‌ ఐడీ వివరాలను పొందుపర్చాలి. మూడో దశలో ఆధార్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసిన తర్వాత మీకు రెండు ఆప్షన్లు (ఓటీపీ లేదా ఫింగర్‌ప్రిట్‌) లభిస్తాయి. ముందుకు సాగేందుకు మీరు వీటిలో దేన్నైనా ఎంచుకోవచ్చు. నాలుగో దశలో మీరు యూజర్‌ ఐడీని క్రియేట్‌ చేసుకోవాలి. తర్వాత యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేయాల్సిందిగా మీకు సూచిస్తారు. దీంతో డిజిటల్‌ లాకర్‌ ఖాతా కోసం మీకు నచ్చిన యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌చేసి ‘సైనప్‌' బటన్‌పై క్లిక్‌చేస్తే సరిపోతుంది. మీ అకౌంట్‌ క్రియేషన్‌ విజయవంతమైన తర్వాత డిజీలాకర్‌ ‘డ్యాష్‌బోర్డ్‌' స్క్రీన్‌ ప్రత్యక్షమవుతుంది.

VIDEOS

logo