ఆదివారం 24 మే 2020
Business - Feb 24, 2020 , 00:02:34

ఏసీలకూ కరోనా కాటు!

ఏసీలకూ కరోనా కాటు!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: చైనాను కుదిపేస్తున్న కరోనా వైరస్‌ సామాన్యుడితోపాటు ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్‌, ఫార్మా, కన్జ్యూమర్‌ రంగాలపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్నది. ఈ దెబ్బకు వచ్చే వేసవిలో ఎయిర్‌ కండిషనర్లు, ఫ్రిడ్జ్‌లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే మీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతియేటా వేసవిలో ఏసీలు, ఫ్రిడ్జ్‌ల ధరలను పెంచుతున్న వీటి తయారీ సంస్థలు..ఈసారి మాత్రం కరోనా వైరస్‌తో మరో 5 శాతం నుంచి 10 శాతం వరకు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. కంప్రెజర్లపై కస్టమ్‌ డ్యూటీని 5 శాతం వరకు పెంచడం,  కరోనా వైరస్‌తో లాజిస్టిక్‌కు అయ్యే ఖర్చు అధికమవడం ఇందుకు కారణమని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. ఏసీలను తయారు చేయడానికి ప్రధానంగా కంట్రోలర్స్‌, కంప్రెషర్లు, ఇతర విడిభాగాలపై చైనా, థాయ్‌ల్యాండ్‌, మలేషియా దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది..కరోనా వైరస్‌ ప్రభావంతో ఈసారి వీటిని విమానాల్లో తరలించాల్సి ఉండటంతో తయారీదారులపై అదనపు ప్రభావం పడనున్నదని బ్లూస్టార్‌ ఎండీ త్యాగరాజన్‌ పేర్కొన్నారు. దీనివల్ల లాజిస్టిక్‌ అయే  ఖర్చు అధికమవడం, దీనికి తోడు కంప్రెషర్లు, ఇతర విడిభాగాలపై కస్టమ్స్‌ డ్యూటీని పెంచడంతో ధరలను తప్పనిసరిగా పెంచాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఇప్పటికే బ్లూస్టార్‌ సంస్థ ఏసీల ధరలను మూడు శాతం నుంచి 5 శాతం వరకు సవరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్‌లో కంప్రెషర్లపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. గోద్రేజ్‌, పానసోనిక్‌, ఇతర సంస్థలు కూడా ధరలు పెంచడానికి సిద్ధమయ్యాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పానసోనిక్‌ ఇండియా ప్రెసిడెంట్‌, సీఈవో మనీశ్‌ శర్మ తెలిపారు. ప్రతియేటా భారత్‌లో 45 లక్షల ఏసీలు అమ్ముడవుతున్నాయి. 


logo