ప్రతీ వ్యాపారంలోనూ ఒడిదుడుకులు సర్వసాధారణం. తెలివైన నిర్ణయాలతోనే అధిగమించవచ్చు. వ్యాపార వైఫల్యాల నివారణకు ప్రధాన మార్గాలివే.
అవగాహన మనం చేస్తున్న వ్యాపారంపై పూర్తిస్థాయి అవగాహన అవసరం. అప్పుడే రాణించగలం. అనాలోచిత నిర్ణయాలు నష్టాలకు దారితీస్తాయి. మార్కెట్ తీరుతెన్నులకు అనుగుణంగా వ్యాపారాభివృద్ధికి పెద్దపీట వేయాలి. తక్కువ లాభంతోనే కొనుగోలుదారుల్లో మీ విశ్వసనీయత పెరుగుతుంది. నాణ్యతలో రాజీ పడవద్దు.
పరిమిత రుణాలు
రుణాలు పరిమితంగానే ఉండాలి. మితిమీరిన రుణాలు వ్యాపార ఉనికినే ప్రశ్నార్థకం చేస్తాయి. మీ పరపతిని చూసి రుణాలిస్తామని ముందుకు వచ్చినా తిరస్కరించడమే మేలు. సొంత నగదుతో వ్యాపారమే శ్రేయస్కరం. ముఖ్యంగా స్నేహితులు, బంధువుల వద్ద తరచూ చేయిచాచడం నష్టమే. దీనివల్ల ఆపత్కాలంలో సాయం చేసేవారే కరువవుతారు.
ప్రతీదానికీ లెక్క
ప్రతీదానికీ ఓ లెక్కుండాలి. అప్పుడే లాభ, నష్టాలపై సరైన అంచనాకు రావచ్చు. దేనికి ఎంత ఖర్చు చేస్తున్నాం?.. ఎక్కడి నుంచి ఎంత రావాలి?.. అన్నది స్పష్టంగా ఉండాలి. వ్యక్తిగత, వ్యాపార లావాదేవీలను కలిపేయవద్దు. అనేక వ్యాపార లావాదేవీలుంటే.. ఒక్కోదానికి ఒక్కో ఖాతా పుస్తకాన్ని పెట్టాలి. ఫలితంగా నష్టాలొచ్చే వ్యాపారాలను మొదట్లోనే దూరం పెట్టవచ్చు.
అరువు వ్యాపారం వద్దు
అరువు వ్యాపారం ఎప్పటికైనా ముప్పే. ఉద్దెర లావాదేవీలు ఎక్కువైతే దివాలా తీయడమే జరుగుతుంది. పెట్టుబడి లేక కస్టమర్ల డిమాండ్‌ను అందుకోవడం కష్టతరమవుతుంది. మనల్ని అప్పులపాలు చేస్తుంది.