హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాదీ దిగ్గజ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ స్పుత్నిక్-వీ టీకా ధరను శుక్రవారం ప్రకటించింది. ఒక్కో డోస్‌ను రూ.948కి విక్రయిస్తామని, దీనికి జీఎస్టీ 5 శాతం అదనమని చెప్పింది. దీంతో ఒక్కోడోస్ రూ.995.40కు లభిస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇది దిగుమతి చేసుకున్న టీకాల ధర మాత్రమేనని, దేశీయంగా ఉత్పత్తి అయిన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ధర తగ్గొచ్చని చెప్పింది. దీంతో మన దేశంలో అందుబాటులోకి రానున్న మూడో టీకాగా స్పుత్నిక్-వీ నిలువనున్నది.ఇప్పటికే సీరమ్ ఇనిస్టిట్యూట్ వ్యాక్సిన్ కొవిషీల్డ్, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కొవాగ్జిన్లు అందుబాటులోవున్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి మొదటి దశలో 1.50 లక్షల స్పుత్నిక్-వీ టీకాలు ఈ నెల 1న హైదరాబాద్‌కు చేరుకోగా, వీటి వినియోగానికి కసౌలిలోని సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీ నుంచి గురువారం అనుమతులు వచ్చినట్టు రెడ్డీస్ పేర్కొన్నది. ఈ మేరకు శుక్రవారం టీకా ధరను ప్రకటించడంతోపాటు తొలి టీకాను వేసినట్టు వెల్లడించింది. హైదరాబాద్‌లోని రెడ్డీస్ ల్యాబ్స్‌లో నిర్వహించిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కంపెనీ కస్టమ్స్ అండ్ ఫార్మా సర్వీసెస్ గ్లోబల్ హెడ్ దీపక్ సర్పా మొదటి డోస్ తీసుకున్నారు. ఈ ఫొటోను స్పుత్నిక్-వీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. దేశంలో కల్లోలం సృష్టిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు తమవంతుగా భాగస్వామ్య సంస్థలతో కలిసి టీకా ఉత్పత్తిని వేగవంతం చేస్తున్నామని రెడ్డీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జీవీ ప్రసాద్ పేర్కొన్నారు. ‘దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడానికి వ్యాక్సినేషన్ శక్తివంతమైన ఆయుధంగా పనిచేయనుంది. ప్రభుత్వాలు చేపట్టిన వ్యాక్సినేషన్లో పాలుపంచుకోవడం, దేశ ప్రజలను ఆరోగ్యంగా ఉంచడం మా ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. రష్యా నుంచి స్పుత్నిక్-వీ టీకా రెండో దశలో మరో 1.50 లక్షల టీకాలు త్వరలో రానున్నాయి.
భారత్‌లో వాడుతున్న తొలి విదేశీ తయారీ వ్యాక్సిన్ ఇదేనని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. స్పుత్నిక్ రెండోబ్యాచ్ టీకాలు ఈ వారాంతంలో ఇండియాకు వస్తాయని ఆర్డీఐఎఫ్ వెల్లడిస్తూ స్పుత్నిక్-వీ టీకాకు ఇండియా ప్రధాన ఉత్పాదక హబ్‌గా వుంటుందని, ఏడాదికి 85 కోట్ల డోసులకుపైగా ఉత్పత్తి చేసేందుకు భారత ఫార్మా కంపెనీలు గ్లాండ్ ఫార్మా, హెటిరో బయోఫార్మా, పానాసియా బయోటెక్, స్టెలిస్ బయోఫార్మా, విర్కో బయోటెక్లతో వ్యాక్సిన్ ఉత్పత్తికి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపింది. రష్యా అభివృద్ధిపర్చిన ఈ స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ వినియోగానికి 65 దేశాల నుంచి అనుమతులు లభించాయని, ఈ వ్యాక్సిన్ ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమై, కరోనా కేసులు తగ్గేందుకు దోహదపడుతుందన్న ఆశాభావాన్ని ఆర్డీఐఎఫ్ సీఈఓ కిరిల్ డిమిత్రివ్ వ్యక్తంచేసారు.