సోమవారం 26 అక్టోబర్ 2020
Business - Sep 30, 2020 , 03:28:31

కరోనా కాలంలోనూ ముకేశ్‌ అంబానీకి గంటకు 90 కోట్లు

కరోనా కాలంలోనూ ముకేశ్‌ అంబానీకి గంటకు 90 కోట్లు

  • కరోనా కాలంలోనూ కాసుల గలగల

ముంబై, సెప్టెంబర్‌ 29: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ (63) మరో ఘనత సాధించారు. దేశీయ కంపెనీల్లో అత్యంత విలువైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌)కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ముకేశ్‌.. సంపన్నవంతులైన భారతీయుల జాబితాలో వరుసగా తొమ్మిదో ఏడాది అగ్రస్థానంలో నిలిచారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు మార్చి నెలలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నాటినుంచి ముకేశ్‌ అంబానీ ప్రతి గంటకు రూ.90 కోట్ల చొప్పున ఆర్జించడం విశేషం. గత 12 నెలల్లో ముకేశ్‌ మొత్తం సంపద ఏకంగా 73 శాతం వృద్ధిచెంది రూ.6,58,400 కోట్లకు చేరింది. దీంతో ఆయన భారత్‌లోనే కాకుండా ఆసియా ఖండంలోని శ్రీమంతుల జాబితాలో అగ్రస్థానంలో.. ప్రపంచ అపర కుబేరుల జాబితాలో 4వ స్థానంలో నిలిచినట్టు ఇండియా ఇన్ఫోలైన్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎఫ్‌ఎల్‌) వెల్త్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌-2020 వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం.. రూ.1,000 కోట్ల కంటే ఎక్కువ నికర సంపద కలిగిన భారతీయుల సంఖ్య ఐదేండ్ల క్రితంతో పోలిస్తే ఈ ఏడాది మూడు రెట్లు పెరిగి 828కి చేరింది. కానీ సంవత్సరాల వారీగా చూస్తే వీరి సంఖ్య తగ్గింది. 2018లో 831 మంది, 2019లో 953 మంది భారతీయులకు ఈ జాబితాలో చోటు లభించింది. ఈ ఏడాది జాబితాలో స్మితా వీ క్రిష్ణ (గోద్రెజ్‌) రూ.32,400 కోట్ల నికర సంపదతో భారత మహిళల్లో అత్యంత సంపన్నురాలిగా నిలువగా.. బయోకాన్‌ సంస్థ చైర్‌పర్సన్‌ కిరణ్‌ ముజుందార్‌ షా రూ.31,600 కోట్ల నికర సంపదతో ద్వితీయ స్థానంలో ఉన్నారు. మరోవైపు హురున్‌ ఇండియా తాజా జాబితాలో మొత్తం 62 మంది తెలుగువారికి చోటు లభించింది. వీరంతా హైదరాబాద్‌ వాసులే కావడం విశేషం. వీరిలో మురళీ దేవి, కుటుంబం (దివీస్‌ ల్యాబొరేటరీస్‌) రూ.49,200 కోట్ల నికర సంపదతో అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది ఈ జాబితాలో కొత్తగా ఐదుగురు తెలుగువారికి చోటు లభించగా.. ఈ ఏడాది ఈ సంఖ్య 9కి పెరిగింది. ప్రస్తుతం రూ.1,000 కోట్ల కంటే ఎక్కువ నికర సంపద కలిగిన తెలుగువారి మొత్తం సంపద రూ.2,45,800 కోట్లు.logo