శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Dec 31, 2020 , 01:18:17

9 లక్షల కోట్ల రుణాలు రద్దు

9 లక్షల కోట్ల రుణాలు రద్దు

గత పదేండ్లలో దేశీయ బ్యాంకుల రైటాఫ్‌ 

తాజా  నివేదికలో ఆర్బీఐ వెల్లడి

న్యూఢిల్లీ: సామాన్యుడికి రుణం కావాలంటే సవాలక్ష కాగితాలు, ష్యూరిటీలు అడిగే బ్యాంకులు.. కార్పొరేట్‌ సంస్థలకు మాత్రం పిలిచి మరీ రుణాలు కట్టబెడుతున్నాయి. ఇవి సక్రమంగా వసూలు కాకపోవడంతో ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్‌ రంగ బ్యాంకులు కూడా ఏకంగా లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేస్తున్నాయి. గత పదేండ్ల కాలంలో దేశీయ బ్యాంకులు రూ.8,83,168 కోట్ల రుణాలను రైటాఫ్‌ చేశాయని రిజర్వు బ్యాంక్‌ తాజా నివేదికలో వెల్లడించింది. రద్దు చేసిన వాటిలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 76 శాతంగా ఉండటం గమనార్హం. 2010 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.6,67,345 కోట్ల రుణాలను రద్దు చేయగా, ప్రైవేట్‌ బ్యాంకులు రూ.1,93,033 కోట్లు, విదేశీ బ్యాంకులు రూ.22,790 కోట్ల రుణాలను రద్దుచేసినట్లు నివేదిక వెల్లడించింది.  

 గతేడాదిలోనే రూ.2.37 లక్షల కోట్లు

2010 నుంచి తొమ్మిదేండ్లలో రూ.6.40 లక్షల కోట్ల రుణాలను రద్దుచేసిన బ్యాంకులు..2019-20లోనే రూ.2,37,206 కోట్లను రైట్‌-ఆఫ్‌ చేయడం విస్మయానికి గురి చేస్తున్నది. వీటిలో పీఎస్‌బీలవి రూ.1.78 లక్షల కోట్లు ఉండగా, రూ.53 వేల కోట్లు ప్రైవేట్‌ బ్యాంకులవి. చిన్న ఆర్థిక సేవల సంస్థలను రద్దు చేసిన వాటి విలువ దీంట్లో జతపరుచలేదు. రూ.92.60 లక్షల కోట్ల స్థాయిలో ఉన్న దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో రుణాల రద్దు వాటా 2.56 శాతంగా ఉన్నది. 

రికవరీ కాలేక..

బ్యాంకులు ఇచ్చిన రుణాలు తిరిగి రికవరీ కాలేకపోవడంతో అలాంటి రుణాలను బ్యాంకులు రైట్‌-ఆఫ్‌ చేస్తుంటాయి. గతేడాది కరోనా కారణంగా రుణాలు పూర్తి స్థాయిలో రికవరీ కాలేకపోవడంతో బ్యాంకులు వీటిని మొండి బకాయిల జాబితాలోకి చేర్చారు. ఈ రుణాలను రద్దు చేయడంతో బ్యాంకుల ఆర్థిక స్థితిగతులు, లాభాలపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపనున్నది. 

ఆర్బీఐ హెచ్చరిక

బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల విలువ తగ్గినప్పటికీ..లక్షల కోట్ల రుణాలను రైట్‌-ఆఫ్‌ చేయడంతో బ్యాంకుల ఆర్థిక స్థితిగతులపై ప్రభావం చూపనున్నదని రిజర్వుబ్యాంక్‌ హెచ్చరించింది. మార్చి 2019 నాటికి 9.1 శాతంగా ఉన్న షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల విలువ..మార్చి 2020 నాటికి 8.2 శాతానికి, సెప్టెంబర్‌ నాటికి 7.5 శాతానికి తగ్గాయి. మొత్తం ఎగవేత రుణాల్లో రూ.5 కోట్ల కంటే అధికంగా తీసుకున్న రుణాల వాటా 79.8 శాతంగా ఉన్నది. 

2019-20లో బ్యాంకులు రద్దుచేసిన రుణాలు

బ్యాంక్‌ (రూ.కోట్లలో)

ఎస్బీఐ 52,362

ఇండియన్‌ ఓవర్‌సీస్‌ 16,406

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 15,886

యూకో బ్యాంక్‌ 12,479

ఐసీఐసీఐ బ్యాంక్‌ 10,952

యాక్సిస్‌ బ్యాంక్‌ 10,169

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 8,254


VIDEOS

logo