శనివారం 15 ఆగస్టు 2020
Business - Jul 21, 2020 , 02:19:37

రుణ భారతం

రుణ భారతం

  •  దేశ జీడీపీలో 88 శాతానికి  ప్రభుత్వ అప్పులు
  • రూ.170 లక్షల కోట్లకు  చేరవచ్చని ఎస్బీఐ అంచనా

ముంబై, జూలై 20: దేశ జీడీపీలో ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) ప్రభుత్వ అప్పుల వాటా 87.6 శాతానికి చేరవచ్చని ఎస్బీఐ ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ రిసెర్చ్‌ పబ్లికేషన్‌ ఎస్బీఐ ఎకోరాప్‌ అంచనా ప్రకారం ఇది దాదాపు రూ.170 లక్షల కోట్లకు సమానం. గత ఆర్థిక సంవత్సరం (2019-20) భారత జీడీపీలో ప్రభుత్వ రుణ భారం 72.2 శాతంగానే ఉన్నది. అయితే కరోనా వైరస్‌ నేపథ్యంలో చితికిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థ.. సర్కారును అదనపు రుణాల వైపు నడిపిస్తున్నది. ఖజానాకు అన్ని రకాలుగా పడిపోయిన ఆదాయం, అంతకంతకూ పెరిగిపోతున్న ఖర్చులు.. అప్పుల కుప్పగా మారుతున్నాయని సోమవారం ఎస్బీఐ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ రుణ భారం పెరుగుతున్నకొద్దీ దేశ జీడీపీ మైనస్‌లోకి వెళ్లిపోతుంది. ఎస్బీఐ తాజా అంచనాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రం అప్పులు 15 శాతానికిపైగానే పెరుగవచ్చని తెలుస్తున్నది. నిజానికి నాలుగు శాతానికిపైగా పెరిగితేనే వృద్ధిరేటులో క్షీణత చోటుచేసుకుంటుంది. అలాంటిది 15 శాతానికిపైగా పెరిగే వీలుండటంతో వృద్ధిరేటు పతనానికి ప్రభుత్వ రుణ భారం పెద్ద కారణంగానే నిలుస్తున్నది. ఇక కరోనా వైరస్‌ ఉధృతి, లాక్‌డౌన్‌లతో స్తంభించిన ఉత్పత్తి, మందగించిన మార్కెట్‌.. దేశ జీడీపీ అంచనాలను మైనస్‌లోకి నెట్టాయని ఎస్బీఐ ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.

ఆర్బీఐ ఆదుకోవాలి

కరోనా సంక్షోభం నేపథ్యంలో తలెత్తిన ఈ విపత్కర పరిస్థితుల నుంచి ప్రభుత్వాన్ని రిజర్వ్‌ బ్యాంకే ఆదుకోగలదని ఈ సందర్భంగా ఎస్బీఐ ఎకోరాప్‌ అభిప్రాయపడింది. ఆర్బీఐ ద్వారా డైరెక్ట్‌ మానిటైజేషన్‌ ఆఫ్‌ డిఫిసిట్‌కు ప్రతిపాదించింది. ఈ ప్రక్రియలో ప్రభుత్వ ఆర్థిక లోటును సెంట్రల్‌ బ్యాంకే నగదీకరిస్తుంది. బాండ్ల క్రయవిక్రయాల ద్వారా ఇదంతా జరుగుతుంది. మార్కెట్‌ పరిస్థితులు అనుకూలంగా లేనందున ఆర్బీఐ జోక్యం తప్ప వేరే మార్గం లేదని, విదేశీ రుణ భారం పెరుగడం ఇప్పుడున్న తరుణంలో ఏమాత్రం మంచిది కాదని ఆర్థికవేత్తలు అంటున్నారు.


logo