మంగళవారం 07 ఏప్రిల్ 2020
Business - Mar 19, 2020 , 23:46:51

రూపాయే..!

రూపాయే..!

  • 86 పైసలు పడిపోయిన మారకం 
  • చారిత్రక కనిష్ఠ స్థాయికి దేశీయ కరెన్సీ

ముంబై, మార్చి 19: రూపాయి మరింత బక్కచిక్కింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గురువారం ఒకేరోజు 86 పైసలు లేదా 1.16 శాతం పతనం చెంది చారిత్రక కనిష్ఠ స్థాయి రూ.75.12కి జారుకున్నది. గడిచిన ఆరు నెలల్లో ఒకే రోజు ఇంతటి స్థాయిలో పతనం చెందడం ఇదే తొలిసారి. ఫారెక్స్‌ మార్కెట్‌ నుంచి మదుపరులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడంతో మారకం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి జారుకోవచ్చన్న అంచనాలు, ఆందోళనలు ఈక్విటీ మార్కెట్లతోపాటు ముడి చమురు తిరిగి కోలుకోవడంతో కరెన్సీల పతనాన్ని శాసించాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత నెలలో దేశీయ ఈక్విటీ, డెబిట్‌ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు లక్ష కోట్ల రూపాయలకు పైగా నిధులను ఉపసంహరించుకోవడంతో కరెన్సీ తీవ్ర ఒత్తిడికి గురైంది. 

కరోనా వైరస్‌ మరింత విజృంభిస్తుండటంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండటంతో అటు ఈక్విటీలు, మరోవైపు కరెన్సీలు నేలచూపులు చూస్తున్నాయి. గురువారం ఉదయం 74.96 వద్ద ప్రారంభమైన డాలర్‌-రుపీ ఎక్సేంజ్‌ రేటు ఒక దశలో చారిత్రక కనిష్ఠ స్థాయి 75.30ని తాకింది. చివరకు బుధవారం ముగింపుతో పోలిస్తే 86 పైసలు క్షీణించి 75.12 వద్ద ముగిసింది. ఇది కూడా ఆల్‌టైం కనిష్ఠ స్థాయి. సెప్టెంబర్‌ 3, 2019 తర్వాత ఒకేరోజు ఇంతటి స్థాయిలో పతనం చెందడం ఇదే తొలిసారి. ఎఫ్‌పీఐలు భారీగా నిధులను ఉపసంహరించుకోవడం, గ్లోబల్‌ మార్కెట్లు రోజు రోజుకు కరిగిపోతుండటం రూపాయి పతనానికి ఆజ్యం పోశాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ హెడ్‌ వీకే శర్మ తెలిపారు. 

10 బిలియన్‌ డాలర్లు వెనక్కి

ప్రస్తుత నెలలో దేశీయ ఈక్విటీ, డెబిట్‌ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు ఏకంగా 10 బిలియన్‌ డాలర్ల నిధులను ఉపసంహరించుకున్నారు. 2013 తర్వాత ఒక నెలలో ఇంతగానం వెనక్కి తీసుకోవడం ఇదే ప్రథమం. రిజర్వు బ్యాంక్‌ రంగ ప్రవేశం చేయడంతో చివరకు భారీ నష్టాలను తగ్గించుకోగలిగింది. ఈ నెల 23న 2 బిలియన్‌ డాలర్ల నిధులను ఫారెక్స్‌ మార్కెట్లోకి చొప్పించనున్నట్లు ఆర్బీఐ ప్రకటన ఈ పతనానికి స్వల్ప బ్రేకులు వేసింది. మిగతా ఆరు కరెన్సీలు ఒక్క శాతానికి పైగా బలోపేతం అయ్యాయి. 18 ఏండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన ఇంధన ధరలు గురువారం 4.50 శాతం బలపడి 26 డాలర్లకు చేరుకున్నది. 


logo