శుక్రవారం 30 అక్టోబర్ 2020
Business - Sep 18, 2020 , 00:27:01

66 లక్షల ఉద్యోగాలు ఔట్‌

66 లక్షల ఉద్యోగాలు ఔట్‌

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ రోజు కూలీల ఉపాధినే కాదు.. వృత్తి విద్యా నిపుణుల ఉద్యోగాలనూ మింగేసింది. దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసిన ఈ మహమ్మారి.. లక్షలాది వైట్‌ కాలర్‌ ప్రొఫెషనల్‌ జాబ్స్‌ను తుడిచిపెట్టేసింది. ఈ ఏడాది మే-ఆగస్టు మధ్య ఏకంగా 66 లక్షల ఉద్యోగాలు పోయినట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) విశ్లేషణలో తేలింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, టీచర్లు, అకౌంటెంట్లు, ఫిజీషియన్లు, అనలిస్టులు ఇలా ఎందరో ప్రొఫెషనల్‌ ఉద్యోగులు నిరుద్యోగులైనట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు అన్న తేడా లేకుండా ఉద్యోగాలకు దూరమైనట్లు పేర్కొన్నది. వృత్తి విద్యా స్వయం ఉపాధి నిపుణులకు జరిగిన నష్టాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య మరింతగా ఉండొచ్చని ఈ సందర్భంగా సీఎంఐఈ తెలియజేసింది. గతేడాది మే-ఆగస్టు వ్యవధిలో దేశంలో వైట్‌ కాలర్‌ వర్కర్లు 1.88 కోట్లుగా ఉన్నారని, ఈ ఏడాది మే-ఆగస్టు నాటికి 1.22 కోట్లకు పడిపోయారని వెల్లడించింది. 

50 లక్షల కార్మికులపై కరోనా పిడుగు

పరిశ్రమల్లో పనిచేసే కార్మికులను కరోనా పరిస్థితులు తీవ్రంగా ప్రభావితం చేశాయని సీఎంఐఈ తెలిపింది. ఈ నాలుగు నెలల్లో 50 లక్షల మంది కార్మికులు ఉపాధిని కోల్పోయారని చెప్పింది. గతేడాదితో పోల్చితే 26 శాతం ఉపాధి రేటు పడిపోయిందన్నది. కాగా, ఏప్రిల్‌లో అత్యధిక మందికి ఉద్యోగాలు, ఉపాధి దూరమైనా.. ఆగస్టు నాటికి ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చిందని సీఎంఐఈ చెప్పింది.