ఆదివారం 07 మార్చి 2021
Business - Feb 20, 2021 , 00:43:42

6,554 కోట్ల తప్పిదం

6,554  కోట్ల తప్పిదం

పొరపాటున బదిలీ చేసిన సిటీ బ్యాంక్‌

న్యూయార్క్‌, ఫిబ్రవరి 19: ఏ రంగంలోనైనా తప్పులు దొర్లడం సహజం. ఇందుకు బ్యాంకింగ్‌ రంగమూ మినహాయింపు కాదు. అయితే ఆ పొరపాటు విలువ వేల కోట్ల రూపాయల్లో ఉంటే.. అవును గ్లోబల్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం సిటీ బ్యాంక్‌లో ఇప్పుడు అలాంటి తప్పే చోటు చేసుకున్నది. దీని విలువ దాదాపు రూ.6,554 కోట్లు (900 మిలియన్‌ డాలర్లు). బ్యాంకింగ్‌ చరిత్రలోనే అతిపెద్ద తప్పుల్లో ఒకటిగా చెప్పుకుంటున్న దీని వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ కాస్మటిక్‌ కంపెనీ రెవ్లాన్‌, దాని రుణదాతలకు మధ్య అడ్మినిస్ట్రేటివ్‌ ఏజెంట్‌గా సిటీ బ్యాంక్‌ సేవలందిస్తున్నది. ఈ క్రమంలోనే లెండర్స్‌కు రూ.58 కోట్లు (8 మిలియన్‌ డాలర్లు) చెల్లించాల్సిన సిటీ బ్యాంక్‌.. సిబ్బంది తప్పిదంతో వారి ఖాతాల్లో రూ.6,554 కోట్లు వేసేసింది. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని ఆ మొత్తాన్ని వసూలు చేసే పనిలో పడింది. కానీ కొందరి నుంచే డబ్బు తిరిగి వెనక్కి వచ్చింది. ఇంకా రూ.3,629 కోట్లు (500 మిలియన్‌ డాలర్లు) రావాల్సి ఉన్నది. దీంతో చివరకు సిటీ బ్యాంక్‌ కోర్టుకెక్కాల్సి వచ్చింది. అయితే ఈ సందర్భంగా యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ జడ్జీ జస్టిస్‌ జెస్సీ ఫర్మన్‌.. ‘పొరపాటున వేశారన్నది ఎవరికీ తెలియదు. ఈ లావాదేవీలు పూర్తయ్యాయి. ఉపసంహరణకు వీల్లేదు’ అన్నారు. అంతేగాక దీన్ని బ్యాంకింగ్‌ చరిత్రలో జరిగిన భారీ తప్పుగా అభివర్ణించారు. సిటీ బ్యాంక్‌ ఎంత వాదించినా ఫలితం లేకపోయింది. దీంతో దీనిపై బ్యాంక్‌ అప్పీలు చేసే యోచనలో ఉన్నది. మరోవైపు రెవ్లాన్‌ సంస్థ కూడా దీనిపై స్పందించడం లేదు. కాగా, సాధారణంగా ఇంత పెద్ద మొత్తంలో నగదు మరొకరి ఖాతాల్లోకి బదిలీ అవ్వదు. ఎందుకంటే ఖాతా నెంబర్లు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్స్‌ ఇలా ఎన్నో బ్యాంక్‌ నిబంధనలుంటాయి. గతంలో భారత్‌లోనూ ఇలాంటి తప్పిదమే ఓ ప్రభుత్వ రంగ బ్యాంక్‌లో జరిగింది. కానీ ఆ తప్పును గుర్తించిన వెంటనే బదిలీ అయిన మొత్తం నగదు వెనక్కి వచ్చేసింది.


VIDEOS

logo