మంగళవారం 04 ఆగస్టు 2020
Business - Jul 14, 2020 , 00:00:05

టీసీఎస్‌లో 40 వేల ఉద్యోగాలు!

టీసీఎస్‌లో 40 వేల ఉద్యోగాలు!

బెంగళూరు: కరోనా వైరస్‌తో ఒకవైపు ఉద్యోగులను తీసివేస్తుండగా.. మరోవైపు దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ప్రస్తుత సంవత్సరంలో 40 వేల మంది సిబ్బందిని నియమించుకునేయోచనలో ఉన్నది. వీరందరిని క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్ల ద్వారానే ఎంపిక చేసుకోనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గతేడాది ఇంతే స్థాయిలో ఉద్యోగులను నియమించుకున్న సంస్థ.. వచ్చే మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న క్యాంపస్‌లలో నైపుణ్యం ఎక్కువ ఉన్నవారిని రిక్రూట్‌ చేసుకోనున్నట్టు కంపెనీ ఈవీపీ, గ్లోబల్‌ హెచ్‌ఆర్‌ హెడ్‌ మిలింద్‌ లకాడ్‌ తెలిపారు. అలాగే హెచ్‌-1బీ, ఎల్‌-1 వర్క్‌ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి అమెరికాలో 2 వేల మందిని అక్కడి క్యాంపస్‌ల నుంచి నియమించుకోనున్నట్లు చెప్పారు. కరోనా వైరస్‌తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ప్రభావం పడనున్నదన్న ఆయన.. రెండో అర్థభాగం నాటికి తిరిగి కోలుకోవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. గతేడాది నియమించుకున్న ఫ్రెషర్లు ఈ నెల చివరి నాటికి ఉద్యోగాల్లో చేరనున్నారని, వీరిలో 87 శాతం మంది యాక్టివ్‌గా ఉన్నారని చెప్పారు. వీరితోపాటు 100 మంది అనుభవం ఉన్నవారిని సైతం నియమించుకోనున్నది సంస్థ. 


logo